కిటకిటలాడుతున్న పెద్ద మార్కెట్
సాక్షి, శ్రీకాకుళం: ఏడాదిలో అత్యంత భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహించే మాసాల్లో కార్తీక మాసం, శ్రావణ మాసాలు ముఖ్యమైనది. దీనిలో భాగంగా శుక్రవారాల్లో వరలక్ష్మీ దేవికి నిష్టతో పూజలు నిర్వహించి, కుటుంబ మంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. అయితే ఆడపడుచుల భక్తి భావాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నేడు శ్రావణ శుక్రవారం కావడంతో మార్కెట్లో అమాంతం పూజా సామగ్రికి ధరలు పెంచేశా రు. ఫలితంగా సామగ్రిని కొనుగోలు చేసేందుకు మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.
పసిడి పైపైకి...
మహిళలంతా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావాలని బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఈ ఏడాది మాత్రం పసిడి ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. గత నెలలో తులం బంగారం ధర రూ.37 వేలు ఉండగా..ప్రస్తుతం రూ.43,300లకు పైగా ఉంది. దీంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో కొన్ని షాపులకు బోణీ కూడా పడడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పువ్వులు తక్కువగా వస్తున్నాయి
జిల్లాలో ప్రస్తుతం పండే పువ్వులు ఏమీ లేవు. అక్కడక్కడ బంతి పువ్వులు మాత్ర మే దొరుకుతున్నాయి. చామంతి, గులాబీ, కనకాంబరాలు, లీల్లీ పువ్వులు, మల్లి పువ్వులు, సంపంగి వంటి పువ్వులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నాము. బుట్టలతో మేము కొనుగోలు చేస్తాం. శ్రావణ మాసం కావడంతో బుట్ట పువ్వులకు రూ.10 వేలకు పైగా చెల్లించాల్సి వస్తోంది. కొన్న పువ్వుల్లో చాలావరకు పాడై పోతున్నాయి. ఏమి చేయాలో తెలియక కొనుగోలుదారుల మీద ఆ భారం వేయాల్సి వస్తోంది. శ్రావణ మాసం అయిపోయాక పువ్వులు కొనేవారే కరువవుతారు.
–ఎ.రాజు, పువ్వుల వ్యాపారి, ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీకాకుళం
వర్షాలకు సరుకు రావడం లేదు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ లారీలు నిలిచిపోయి సరుకులు రావడం లేదు. రెండు మూడు రోజు లు రవాణా నిలిచిపోవడంతో పండ్లు కుల్లిపోయి పాడవుతున్నాయి. దీంతో వచ్చిన సరుకు అధిక ధరలకు అమ్మాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష వంటి వాటిని అధిక ధరలకు అమ్మక తప్పడం లేదు. హోల్‌సేల్ వ్యాపారు ల నుంచి కొంచెం కొంచెం కొనుగోలు చేసి రిటైల్‌గా అధిక ధరలకు అమ్మక తప్పడం లేదు. బేరాలు ఉన్నప్పుడే నష్టాన్ని పూడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
–కె.బాలాజీ, పండ్ల వ్యాపారి, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, శ్రీకాకుళం
వ్యాపారాలు సరిగా లేవు
శ్రావణం మాసంలో బంగారం ధరలు పెరగడంతో వ్యాపారాలు పడిపోయాయి. గతేడాది శ్రావణ మాసంలో కాస్తా వ్యాపారాలు అనుకూలంగానే జరిగాయి. ఈ ఏడాది మాత్రం ఆశించిన స్ధాయిలో కాదు అసలు చాలామంది వ్యాపారులకు బోణీ కూడా పడడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గిస్తేనే కొనుగోళ్లు పెరుగుతాయి.
బంగారం కొనలేకపోతున్నాం
ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఈ ఏడాది మాత్రం బంగారం ధరలు ఒక్కసారిగా రూ.5 వేలకు పైగా పెరగడంతో భారమైంది. ధరలు తగ్గుముఖం పడితే కొనేందుకు అవకాశం కలుగుతుంది.
–తంగి రాజేశ్వరి, మహిళ, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment