
సాక్షి, అమరావతి: ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ నమోదుకాని విధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం గర్వంగా ఉందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 80.31 శాతం పోలింగ్ నమోదయ్యిందన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కేవలం 67.47 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 79.64 శాతం ఓట్లు నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాత మొత్తం పోలింగ్ 80.31 శాతానికి చేరింది.
2014లో నమోదైన 78.41 శాతంతో పోలిస్తే ఈ ఏడాది 1.9 శాతం అదనంగా ఓటింగ్ నమోదయింది. అదే విధంగా దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ఏకంగా 12.84 శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయి ఓటింగ్ మన రాష్ట్రంలో మాత్రమే నమోదైనట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. చిన్న రాష్ట్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 81.79 శాతం ఓటింగ్‌తో అస్సాం మొదటిస్థానంలో నిలిచింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, దివ్యాంగులు, పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లుపెద్దఎత్తున నమోదైనట్లు ద్వివేది తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈవీఎంలో నమోదైన ఓట్లకు వీవీప్యాట్ స్లిప్పులకు ఎక్కడా తేడా వచ్చినట్టు ఫిర్యాదు నమోదు కాలేదని ద్వివేది స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment