
సాక్షి, అమరావతి: ఎన్నికల లెక్కింపులో సాంకేతిక సమస్య వల్ల ఫలితం తేలకపోతే రీపోలింగ్‌కు ఆదేశించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించి, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కలో తేడా వచ్చినప్పుడు, ఈ ఓట్లే అభ్యర్థి విజయాన్ని నిర్దేశించే విధంగా ఉంటే కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా సంబంధిత బూత్‌లో రీపోలింగ్ నిర్వహించవచ్చని చెప్పారు. అప్పటిదాకా ఆ నియోజకవర్గ ఫలితాన్ని నిలిపివేస్తామన్నారు. ద్వివేది మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అవసరమైతే రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తుందనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి మే 27 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
మధ్యాహ్నం 2 గంటలకల్లా ఈవీఎంల లెక్కింపు పూర్తి!
‘‘కౌంటింగ్ రోజు పొరపాట్లు, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను అందరూ కచ్చితంగా పాటించాల్సిందే. లెక్కింపు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడ్డా, గొడవలు సృష్టించినా ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాం తంగా ముగియడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. కౌంటింగ్‌లో ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఈవీఎంలకు ఉండే మూడు సీళ్లను ఏజెంట్ల సమక్షంలోనే తెరుస్తాం. పోలైన ఓట్లు, టేబుళ్ల సంఖ్య ఆధారంగా ఈవీఎంల లెక్కింపు సమయం ఆధారపడి ఉటుంది. మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఈవీఎంల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నాం. పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం ప్రతి 500 ఓట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తున్నాం’’అని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
అంతకుముందు ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు వినోద్ జుట్షీతో కలిసి విజయవాడ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ఇతర పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈవీఎంల ద్వారా లెక్కింపు సమయంలో మాక్‌పోపోల్ ఓట్లు, ఫారం 17సి విషయంలో ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చెయ్యాలన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో క్రమశిక్షణ కలిగి ఉండాలని పేర్కొన్నారు. అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ మాట్లాడుతూ.. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ఏర్పాట్లపై వినోద్ జుట్షీ సంతృప్తి వ్యక్తం చేశారు.