* సమైక్య శంఖారావంలో రైతులకు, విద్యార్థులకు వైఎస్ జగన్ పిలుపు
* నీళ్ల కోసం ఎక్కడికెళ్లాలంటూ బాబును నిలదీయండి
* ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలంటూ కిరణ్‌ను అడగండి
* వాళ్లు నాయకులని చెప్పుకోవడానికి నోరు కూడా రాదు
* మనందరం కలిసి వీళ్లను బంగాళాఖాతంలో పడేద్దాం
* రాష్ట్రపతిని సమైక్యం కోరలేదేం చంద్రబాబూ?
* సమైక్యానికి అనుకూలంగా లేఖయినా ఇవ్వలేదేం?
* ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి యుద్ధమిది
* 30 ఎంపీ సీట్లు గెలుచుకుని ఢిల్లీని మనమే శాసిద్దాం
* సోనియాను, బాబును, కిరణ్‌ను క్షమించొద్దంటూ జన నినాదం.. ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా చెప్పండంటూ ఉత్సాహపరిచిన జన నేత
చంద్రబాబు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి రైతన్నా ఆయన కాలర్ పట్టుకుని ఒక మాట అడగండి. ‘నీళ్ల కోసం మేమెక్కడికి వెళ్లాలి చంద్రబాబు నాయుడు గారూ?’ అని నిలదీయాలి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తక్కువ తినలేదు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు, చదువుకున్న ప్రతి పేద పిల్లాడు కూడా ‘ఉద్యోగాల కోసం మేమెక్కడికి వెళ్లాలి?’ అని ఆయన కాలర్ పట్టుకుని అడగండి. విడగొడితే రాష్ట్రం ఎడారవుతుందనే విషయాన్ని కూడా వీరు పక్కన పెట్టారు. చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలనే పరిస్థితిని కూడా పక్కన పెట్టారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఏం చేయడానికైనా వెనకాడని ఇటువంటి నాయకులను చూస్తున్నప్పుడు బాధనిపిస్తుంది.
- పలమనేరు నియోజకవర్గ సమైఖ్య శంఖారావంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాష్ట్రపతిని కలవడానికి వెళ్లిన చంద్రబాబు గారు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందిగా ఆయనను ఎందుకు కోరలేదు? సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా రాష్ట్రపతికి ఆయన లేఖ ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. బాబు నోట ఒక్కసారంటే ఒక్కసారి కూడా సమైక్యమనే మాట కూడా ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్నది ఢిల్లీ అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధమని అభివర్ణించారు.
‘త్వరలో సాధారణ ఎన్నిక లు రాబోతున్నాయి. మనందరం ఒక్కతాటి మీదకు వచ్చి 30 ఎంపీ స్థానాలను తెచ్చుకుందాం. ఢిల్లీ కోటను మనమే కట్టుకుందాం’ అంటూ పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఎవరు నిలబెడతారో అప్పుడు తెలుస్తుందన్నారు. ‘‘రాష్ట్రంలో నాలుగు నెలల్లో ఎన్నికలొస్తాయి. మీకు దమ్మూ ధైర్యముంటే ఆ ఎన్నికలకు పోదాం పదండి’ అంటూ సోనియాగాంధీకి, చంద్రబాబుకు సవాలు విసిరారు. ‘‘వాళ్లకు నేను చాలెంజ్ కూడా విసురుతున్నా. నాకు దమ్మూ ధైర్యం ఉన్నాయి. ఆ ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను మేం గెలుచుకుంటామని చెప్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతామని చెప్తున్నాం’’ అన్నారు.
‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రం నలుమూలలకు వెళ్లి చెప్పే ధైర్యం, దమ్ము నాకున్నాయి. మీకున్నాయా?’’ అని వారిని ప్రశ్నించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని నిరసిస్తూ కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా జగన్ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర రెండో దశ శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా పత్తికొండ, అప్పినపల్లె గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి జగన్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...
నీ నోట ‘సమైక్యమే’ రాదేం బాబూ?
చంద్రబాబు గారూ! రాష్ట్రం మొత్తం ఒక్కటిగా ఉండాలనే మాట, సమైక్యం అన్న పదం నీ నోట్లో నుంచి ఎందుకు రావడం లేదూ అని అడగదలుచుకున్నా. రాష్ట్రపతిని కలవడానికి వెళ్లినప్పుడు, ‘ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అని ఎందుకు చెప్పలేదు? సమైక్యానికి అనుకూలంగా లేఖ ఎందుకు ఇవ్వలేదు? టీడీపీ ఎంపీలు రాష్ట్ర్రాన్ని సమైక్యంగా ఉంచండని కనీసం పార్లమెంటులో కూడా అడగరు. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఆంధ్ర రాష్ట్రమంతా సమైక్యంగా ఉండాలంటూ నినదిస్తోంది.
చిత్తూరు జిల్లాలోని 45 లక్షల మంది నోటా సమైక్యాంధ్ర అనే ఒకే ఒక్క మాట వినిపిస్తోంది. కానీ మన ఖర్మ ఏమిటంటే మన కిరణ్‌కుమార్‌రెడ్డికి, చంద్రబాబుకు మాత్రమే మన ఘోష, మన మాట వినపడని పరిస్థితి కనిపిస్తోంది. వీళ్లకసలు మన బాధల గురించి ఆలోచన ఉందా అని ఒక్కొక్కసారి నాకనిపిస్తుంది. రాష్ట్రాన్ని ఒకసారి విడగొడితే నీళ్ల కోసం మనమెక్కడికి వెళ్లాలి అనే అవగాహన వీళ్లకుందా అని అడ గదలుచుకున్నా. కిరణ్‌వి మోసపూరిత రాజకీయాలు. రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీని తీసుకురావాలి. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చినపుడే అది సాధ్యం.
వీళ్లా నాయకులు!
ఆ దివంగత నేత (వైఎస్) మా నాయకుడని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలను చూస్తే బాధగా ఉంది. ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు ఎంతగా చెడిపోయి ఉన్నాయంటే, ఇచ్చిన మాట అంటే, రాజకీయాల్లో నిజాయితీ అంటే అర్థం కూడా తెలియని పరిస్థితుల్లో ఈ నాయకులు కనిపిస్తున్నారు. ఫలాన వాడు మా నాయకుడని సగర్వంగా చెపుకునేటట్టు ఉండాలి. కానీ చంద్రబాబును, కిరణ్‌ను చూస్తున్నప్పుడు మాత్రం, వీళ్లు నాయకులని చెప్పడానికి నోరు కూడా రాదు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలోకి నిజాయితీని తీసుకురావాలి. మనందరం కూడా కలిసికట్టుగా ఒక్కటై వీళ్లందరినీ బంగాళాఖాతంలో పడేయాలి.
రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఒకే ఒక గొంతు వినపడుతోంది. రాష్ట్రాన్ని విడగొట్టండంటూ ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకుని, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇవ్వండంటూ ఎన్జీవోలంతా చంద్రబాబు వద్దకు వెళ్లి ప్రాధేయపడ్డారు. కానీ బాబు ఏమన్నారు? ‘మన పిల్లలు చెన్నైలో బతకడం లేదా? కర్ణాటకలో బతకడం లేదా? అదే విధంగా బతుకుతారులే’ అని చెప్పాడు. నేను బాబును అడగదలచుకున్నా. చంద్రబాబు గారూ! ఒక్కసారి చెన్నై వెళ్లండి. అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తే వాళ్లు మనల్ని ఏ రకంగా చూస్తారో ఒక్కసారి చూడండి. చెన్నై గానీ, కర్ణాటక గానీ వెళ్లి తెలుగులో మాట్లాడితే అక్కడి వాళ్లు మనలను ఎలా చూస్తారో ఒక్కసారి ఆలోచన చేయాలని బాబుకు చెప్తున్నా. మన రాష్ట్రం మనకుండాలి. మన మహానగరం ఉండాలి. మన పిల్లలు ఉద్యోగం కోసం గర్వంగా తలెత్తుకొని అక్కడికి వెళ్లేలా ఉండాలి. కానీ బాబుకు మాత్రం చదువుకునే పిల్లల గురించి ఆలోచన చేసే పరిస్థితే లేదు.
ఇవాళ మన ప్రాంతంలోనే 1,000 అడుగుల లోతుకు బోరు వేసినా నీళ్లు కూడా పడని పరిస్థితి. హంద్రీనీవా పూర్తి కాలేదు. గాలేరునగరి పూర్తి కాలేదు. నీటి కోసం ఎక్కడికెళాల్లో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రైతన్న ఉన్నాడు. కానీ బాబు ఏం చేస్తున్నాడు? రాష్ట్రాన్ని విడగొడతామని ఢిల్లీ పెద్దలు చెప్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, విడగొడితే విడగొట్టండని చెప్తున్నాడు. వీళ్లా నాయకులు! సోనియా తన కొడుకును ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మన పిల్లల ఉద్యోగాలతో చెలగాటమాడుతున్నారు. నాయకుడనే వాడు ఎలా ఉండాలి? ఏదైనా ప్రదేశంలో బాగా లేని పరిస్థితులుంటే అక్కడికి వెళ్లి, ‘నేను బాగు చేస్తాను, నా మీద నమ్మకం ఉంచండి’ అని చెప్పాలి. కానీ ఇవాళ ఈ నాయకులు మాత్రం, ‘కొట్టుకుని చావండి’ అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు!
జగన్ ప్రశ్నలు.. జనం జవాబులు
‘‘ఇవాళ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా, సోనియాగాంధీ గుండెలదిరేలా, చంద్రబాబు, కిరణ్‌ల గుండెలదిరేలా గట్టిగా సమాధానాలు చెప్పండి. కనీసం అప్పుడైనా ఈ నాయకుల్లో మార్పు వస్తుందేమో!’’ అంటూ సమైక్య శంఖారావంలో జగన్ వేసిన ప్రతి ప్రశ్నకూ ప్రజలు విశేషంగా స్పందించారు. ‘వాళ్లు రాష్ట్రాన్ని విభజిస్తామంటే మనం ఒప్పుకుందామా?’ అని ప్రశ్నించగా, ‘ఒప్పుకోం, ఒప్పుకోం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ‘రెండు చేతులు పెకైత్తాలి. ఒప్పుకోబోమని గట్టిగా చెప్పాలి. తెలుగు జాతిని వాళ్లు విడగొడతామంటే మనం ఒప్పుకుందామా అని నేను అడుగుతున్నాను’ అని జగన్ అంటే, ‘ఒప్పుకోం, ఒప్పుకోం అంటూ అంతా రెండు చేతులూ పెకైత్తి మరీ చెప్పారు.
‘ఢిల్లీ వాళ్లకు తెలుగు సరిగా అర్థం కాదు. సోనియాకు, కాంగ్రెస్ వాళ్లకు కాస్త చెవుడు కూడా ఉంది. కాబట్టి ‘నో’ అని ఇంగ్లిష్‌లో గట్టిగా చెప్పాలి’ అని జగన్ సూచించారు. ‘మన నీటి కోసం మనమే తన్నుకొని చావాలా? మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకొని చావాలా?’ అన్న ప్రశ్నలకు ‘నో, నో’ అంటూ ప్రజలంతా మూకుమ్మడిగా బదులిచ్చారు. రాష్ట్రాన్ని విడగొడుతున్న సోనియాను, ప్యాకేజీలు అడుగుతున్న బాబును, మోసం చేస్తున్న కిరణ్‌ను... ఈ ముగ్గురినీ క్షమించాలా అని జగన్ ప్రశ్నించగా, ‘క్షమించొద్దు, క్షమించొద్దు’ అంటూ వారు ముక్త కంఠంతో చెప్పారు. కనీసం ఇప్పటికైనా వాళ్లకు అర్థమవుతుందేమోనన్నదే మన తాపత్రయమని జగన్ అన్నారు.
‘ఒక్కటైతే చెప్తున్నా. వీళ్లకు అర్థమైనా, కాకపోయినా తెలుగువాడు పడుతున్న ఈ బాధను పై నుంచి దేవుడైతే చూస్తున్నాడని వీళ్లందరికీ కచ్చితంగా చెప్తున్నా. నీళ్లు కూడా ఇవ్వకుండా వీళ్లు మోసగిస్తున్న రైతన్న కోసం, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలో అర్థంకాక కొట్టుమిట్టాడుతున్న పిల్లల భవిష్యత్తు కోసం మనందరం ఒక్కటవుదాం. పై నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు. వీళ్లకు గట్టిగా బుద్ధొచ్చేలా ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని విన్పించ ండి’ అని పిలుపునిచ్చారు. అప్పటికైనా వీరికి బుద్ధొస్తుందని ఆశిస్తున్నానన్నారు.
రోడ్లన్నీ జనసంద్రం..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత కోసం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పల్లెలన్నీ పరుగులు తీశాయి. జననేత తిరిగినంత దూరం రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. ఎక్కడ చూసినా ఉరుకులు, పరుగుల మీద తరలివస్తున్న జనమే. పిల్లా పాపలు, యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా రోడ్లపైకి వచ్చి మరీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జేజేలు పలికారు. పలమనేరు నియోజకవర్గంలో శుక్రవారం జగన్ ప్రారంభించిన రెండో విడత సమైక్య శంఖారావానికి ప్రజలు నీరాజనం పట్టారు. పలమనేరులో ఇప్పటిదాకా ఏ నేతను చూసేందుకు రానంతమంది జనం జగన్‌ను చూసేందుకు రావడం, గంటల తరబడి ఆయన కోసం వేచి ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒక్కో గ్రామంలో పది పన్నెండు చోట్ల జనం గుంపులు గుంపులుగా నిలబడి జగన్‌కు హారతులిచ్చారు. తిలకం దిద్దారు. డప్పులు, నృత్యాలు, పూలమాలలతో స్వాగతం పలికారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందిగా విన్నవించారు. జగన్ పర్యటించిన గంగవరం, పలమనేరు, పెద్దపంజాణి మండలాల్లో ప్రజలు పనులన్నీ మానుకుని, గంటల తరబడి రోడ్లపైనే నిలిచి మనసారా స్వాగతం పలికారు. జనమంతా రోడ్ల మీదకు రావడంతో కొన్ని గ్రామాలను దాటేందుకు జగన్‌కు గంటకు పైగా పట్టింది! బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం రోడ్డు మార్గంలో శంఖారావానికి బయల్దేరిన జగన్‌కు సరిహద్దులోని కర్ణాటక గ్రామాల ప్రజలు కూడా ఘనస్వాగతం పలికారు. నంగిలి గ్రామంలోని 1,000 మందికి పైగా తెలుగువారు సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ కొన్ని గంటల పాటు వేచి ఉండి మరీ ఆయనను స్వాగతించారు.
ఉదయం 11 గంటలకు జంగాలపల్లి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించిన జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన్ను చూసేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, ముస్లింలు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర విభజన పాపం చిత్తూరు జిల్లాకే చెందిన చంద్రబాబు, కిరణ్‌లదేనంటూ విమర్శించినప్పుడు వారి నుంచి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం రాత్రి పెద్దవెలగటూరులోని వైఎస్సార్‌సీపీ నేత జయరామిరెడ్డి ఇంట్లో జగన్ బస చేశారు. శనివారం కూడా యాత్ర పలమనేరు నియోజకవర్గంలోనే జరగనుంది.
బాబు, కిరణ్‌ల కాలర్ పట్టుకోండి
Published Sat, Dec 28 2013 2:22 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement