
27 నుంచి సమైక్య శంఖారావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర ఈనెల 27వతేదీన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి పున:ప్రారంభం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా ఈ సందర్భంగా జగన్ ఓదార్చనున్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో జగన్ గత నెల 30న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘సమైక్య శంఖారావం’ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మధ్యలో పార్లమెంట్ సమావేశాలు జరగటం, ఆర్టికల్ 3 సవరించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరుతూ జగన్ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టేందుకు సమైక్య శంఖారావం యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు.
జగన్ డిసెంబర్ 27న మధ్యాహ్నం 12 గంటలకు పలమనేరు నియోజకవర్గంలోని 4వ రోడ్ క్రాస్ చేరుకుని సమైక్య శంఖారావం యాత్రను కొనసాగిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురామ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలమనేరు నియోజకవర్గం పత్తికొండలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. నక్కపల్లిలో కూడా వైఎస్సార్ విగ్రహావిష్కరణతోపాటు బహిరంగసభ జరుగుతుంది. అనంతరం అప్పినపల్లిలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాన్ని జగన్ ఓదార్చనున్నారని తెలిపారు.
పులివెందులకు జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి కుటుంబసమేతంగా పులివెందులకు బయలుదేరి వెళ్లారు. క్రిస్‌మస్ పండుగ సందర్భంగా మూడు రోజులపాటు ఆయన పులివెందులలోనే ఉంటారు.