మన గడ్డమీద పుట్టి మనల్నే మోసం చేస్తున్నారు : జగన్
చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ మన గడ్డ మీద పుట్టి మనల్నే మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఈరోజు ఆయన ఇక్కడకు వచ్చారు. గాంధీ సర్కిల్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సమైక్యమే వినిపిస్తుందని చెప్పారు.
చిత్తూరు నగరంలో బిందె నీళ్లు 2 రూపాయలకు కొనాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మహానేత వైఎస్‌ఆర్ మరణించాక రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చారన్నారు. సీఎం పదవి కోసం కిరణ్ సోనియా గీసిన గీత దాటడం లేదని చెప్పారు. మొదటగా అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందిపోయి మనల్నే చర్చించుకోమంటున్నారని విమర్శించారు. కేంద్రం దారుణంగా వ్యవహరించడానికి కారణం చంద్రబాబు నోట సమైక్యమనే మాట రాకపోవడమేనన్నారు.
రాష్ట్ర విభజనకు తోడ్పడుతున్న కిరణ్, చంద్రబాబులకు సమైక్యత కోరుకునే 70 శాతం మంది ఉసురుతగులుతుందని హెచ్చరించారు. 30 ఎంపీ స్థానాలను గెలుచుకుని సమైక్యమన్న వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదామన్నారు.
అంతకు ముందు దర్గా సెంటర్‌లో జగన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.