బాబు, కిరణ్ కాలర్ పట్టుకుంటే ఏం చేస్తారు?
చిత్తూరు: చంద్రబాబు ఏసీ రూమ్‌లో కూర్చుని సీమాంద్ర, తెలంగాణ అంటూ విభిన్న వాదనలు చేయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. సమైక్య శంఖారావంలో భాగంగా చిత్తూరు జిల్లా సాదుంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించి, అనంతరం బహిరంగం సభలో మాట్లాడారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సీఎం కిరణ్, చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో చంద్రబాబు, కిరణ్‌లు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. మోజార్టీ ఎమ్మెల్యేలు విభజన వద్దంటున్నా వినడం లేదన్నారు. వచ్చిన బిల్లును వెనక్కి పంపకుండా చర్చకు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. చర్చకు ఉత్సాహపడుతున్న నేతలు ఏనాడైనా ఆమరణదీక్షలు చేశారా, అఫిడవిట్లు ఇచ్చారా అని నిలదీశారు. విభజనకు వ్యతిరేకంగా కనీసం ఒక్క లేఖ అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.
విభజన జరగకుండానే హైదరాబాద్ వదిలి వెళ్లమంటున్నారని వాపోయారు. ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలంటూ యువత బాబు, కిరణ్ కాలర్ పట్టుకుంటే ఏం చేస్తారని జగన్ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రం అంతా ఒక్కటౌతుందని త్వరలోనే ఉప్పెన లేస్తుందన్నారు. ఆ ఉప్పెనలో విభజనవాదులు కొట్టుకుపోతారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో 30ఎంపీలు స్థానాలు గెలుచుకుందాం, రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దామని జగన్ అన్నారు.