ఖాకీ వనంలో హోం | Home Guards Day Special Story | Sakshi
Sakshi News home page

ఖాకీ వనంలో హోం

Published Wed, Dec 5 2018 11:43 AM | Last Updated on Wed, Dec 5 2018 11:43 AM

Home Guards Day Special Story - Sakshi

హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం (ఫైల్‌)

ఒంగోలు: ఖాకీ దుస్తులు ధరించి శాంతిభద్రతల విషయంలో పహారా కాసే హోంగార్డుల జీవితాలకు విలువ లేకుండా పోతోంది. దుమ్ము, ధూళి, వర్షంలెక్క చేయక విధలు నిర్వర్తిస్తున్నా కుటుంబానికి కడుపునిండా భోజనం కూడా పెట్టలేని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రేపు హోంగార్డుల దినోత్సవంసందర్భంగా ‘సాక్షి’ కథనం.

హోంగార్డు వ్యవస్థ 1946లో బాంబే ప్రావిన్స్‌లో ప్రారంభమైంది. పౌరులకు అత్యవసర సమయాల్లో, మత ఘర్షణల సమయంలో భద్రతా అధికారులతోపాటు శాంతి భద్రతలను కాపాడటంలో వీరు విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలోనే కనీసం మూడు సంవత్సరాలపాటు హోంగార్డు విధులు నిర్వహించేందుకు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు ఇందులో పాల్గొనేవారు. డాక్టర్లు, లాయర్లు వంటివారు సైతం ఉండేవారు. అయితే స్వాతంత్య్రానంతరం భారత్‌–చైనా యుద్ధ సమయంలో హోంగార్డుల వ్యవస్థకు యూనిఫాం సర్వీసు ఆధ్వర్యంలో ఉంచారు. ఈ క్రమంలోనే పోలీసుశాఖ తన అవసరాలకు అనుగుణంగా హోంగార్డులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం 9 రకాల విభాగాల్లో హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు, ఆర్టీసీ, రవాణాశాఖ, అగ్నిమాపక శాఖ వంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. డ్రైవర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, రాత్రి బీట్‌ సేవలు కూడా అందిస్తున్నారు.

పోరాట ఫలాలు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి హోంగార్డుల వేతనాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రోజువారి వేతనం రూ. 600గా ఉంది. గతంలో పనిచేసిన రోజుకు మాత్రమే వేతనం లభించేది. శెలవు పెడితే వేతనం రానట్లే. అయితే పోరాటాల అనంతరం పోలీసు అధికారుల సహకారంతో ఎట్టకేలకు నెలకు వేతనంతో కూడిన రెండు సెలవులు పొందుతున్నారు. జిల్లాలో అయితే ఎస్పీ సత్య యేసుబాబు మరో రెండు సెలవులను ఇస్తుండడం గమనార్హం. మహిళా హోంగార్డులకు 3 నెలల మెటర్నటీ లీవులు ఇస్తున్నారు. అంతే కాకుండా గతంలో హోంగార్డు వద్ద నుంచి ప్రతి నెలా రూ. 20 కటింగ్‌ చేస్తుండేవారు. దానిని ఇటీవల రూ. 50 చేసి ఎవరైనా హోంగార్డు మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేలు ప్రకటించారు. హోంగార్డులు ఎవరైనా వివాహం చేసుకుంటే వారికి రూ. 5వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం హోంగార్డుల రిక్రూట్‌మెంట్‌ కూడా దాదాపు పోలీసు రిక్రూట్‌మెంట్‌ను పోలి ఉంటోంది. అందువల్ల యుక్త వయస్సులో ఉండి పోలీసుశాఖ పట్ల భక్తి, ప్రజలకు సేవలు అందించాలనే తపన ఉన్నవారిని ఎంపిక చేస్తున్నారు.

జిల్లాలో హోంగార్డుల వివరాలు: జిల్లాలో మొత్తం 817 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 733 మంది పురుషులు కాగా 84 మంది మహిళలు. వీరిలో జనరల్‌ విభాగంలో 731 మంది విధులు నిర్వహిస్తుండగా 86 మంది వివిధ యూనిఫాం విభాగాల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్, హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, సీఐ ఇలా ర్యాంకులు ఉన్నట్లే హోంగార్డులకు ర్యాంకులున్నాయి. హోంగార్డు, అసిస్టెంట్‌ సెక్షన్‌ కమాండర్, సెక్షన్‌ కమాండర్, ప్లటూన్‌ కమాండర్, కంపెనీ కమాండర్‌ వంటివి ఉన్నాయి. ఎస్పీగా సత్యయేసుబాబు వచ్చిన తరువాత జిల్లాలో హోంగార్డులు కొంతవరకు ఆనందంగా ఉన్నారనే చెప్పవచ్చు. కారుణ్య నియామకాల విషయంలో జాప్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టడం, పోలీసు పెట్రోలు బంకుల్లో హోంగార్డులను పెట్రోలు బాయిస్‌గా విధులు నిర్వహించకుండా చర్యలు చేపట్టడం, చీరాల, కందుకూరు, మార్కాపురం తదితర డివిజన్ల నుంచి టర్న్‌ డ్యూటీల పేరిట ఒంగోలులో డ్యూటీల హాజరుకావాలనే నిబంధననుంచి మినహాయింపు ఇవ్వడం వంటి చర్యల ద్వారా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అంతే కాకుండా హోంగార్డుల కోసం ప్రత్యేకంగా జిల్లా సహకార సంఘాన్ని కూడా రిజిస్టర్‌ చేయించారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది.

చనిపోతే దిక్కెవరు?
ప్రస్తుతం హోంగార్డులు కోరుతున్నది ఉద్యోగ భద్రత. బేసిక్‌తో కూడిన జీతం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ సీనియర్లకు జీతం పెరిగితే వారు కూడా సమాజంలో కాస్త గౌరవంగా మెలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హోంగార్డులకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తాత్కాలికంగా డ్యూటీలు వేసిన సమయంలో టీఏ, డీఏలు ఇవ్వడంలేదు. దీనివల్ల వారు తమకు లభించే వేతనంలోనే అదనపు ఖర్చులను భరించాల్సి వస్తోంది. అలా కాకుండా టీఏ, డీఏలు ఇవ్వాలని కోరుతున్నారు. కుటుంబానికి కనీసం రూ. 5లక్షల వైద్యసాయం, ఏదైనా ప్రమాద వశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలనే విజ్ఞప్తులు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో జిల్లాలోని హోంగార్డులు అందరు కలిసి ఒకరోజు వేతనాన్ని సహచరుల కుటుంబాలకు అండగా ఇస్తూ వస్తున్నాయి. ఏళ్ల తరబడి పనిచేసి రిటైరైన వారికి ప్రభుత్వం నుంచి పైసా అదనపు సాయం కూడా లేకపోతుండటంతో ఒక్కసారిగా విధులనుంచి బయటకు వచ్చిన  ఆర్థిక భారానికి గురికావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం రోజు ఎటువంటి ప్రకటనలను ప్రభుత్వం వెలువరిస్తుందా అని హోంగార్డులు అందరు ఆతృతగా చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement