సాక్షి, సంగారెడ్డి: మళ్లీ భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో భీకరంగా కురిసింది. గురువారం రాత్రి ఆసాంతం ఏకధాటిగా కురిసిన జడివాన పలుచోట్ల బీభత్సం సృష్టించింది. వాగులు, వం కలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నా యి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారులు, కల్వర్టులపై వరద పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నకోడూరు మం డలం మందపల్లిలో గురువారం రాత్రి ఓ వ్యవసాయ క్షేత్రంపై పిడుగుపడటంతో రాజశేఖర్‌రెడ్డి అనే రైతుకు చెందిన ఆవు, దూడ చనిపోయాయి.
సదాశివపేట మండలం మాచిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో గంగకత్వ కాల్వ వరద నీరు ఓ కోళ్లఫారంలోకి చొచ్చుకురావడంతో 6 వేల కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ జలాలొద్దీన్ బాబుకు సంబంధించిన కోళ్లఫారమని స్థానికులు తెలిపారు. భారీ వర్షానికి జిల్లావ్యాప్తంగా పాత ఇళ్లు కుప్పకూలాయి. గురువారం ఒక్కరోజే 59 ఇళ్లు పూర్తిగా, 144 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల్లో పంట నీట మునగడంతో పత్తి, మొక్కజొన్న, చెరకు, సోయాబీన్ పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పంట నష్టంపై ఎన్యూమరేషన్(గణన) జరిపి నివేదించాలని జిల్లా వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించింది. శుక్రవారం అందిన అధికారిక సమాచారం ప్రకారం మునిపల్లి మండలంలోని పది గ్రామాల్లో 570 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. సంగారెడ్డి, పుల్కల్ మండలాల్లో సైతం భారీగా పంటలు దెబ్బతిన్నా ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడి కాలేదు. వెల్దుర్తి మండలంలో రోడ్డుపై ఎండబెట్టిన మొక్కజొన్న కంకులు నీళ్లలో తడిచి ఉబ్బిపోయాయి.
‘ఫుల్’కల్
పుల్కల్ మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. గురువారం జిల్లా సగటు వర్షపాతం 36.9 మి.మీటర్లు అయితే, పుల్కల్‌లోనే 19 సెం. మీటర్ల భారీ వర్షం కురిసింది. అ తర్వాత కోహీర్‌లో 92.6 మి.మీటర్లు, పాపన్నపేటలో 74.6, అందోల్‌లో 74.2, గజ్వేల్‌లో 60, నర్సాపూర్‌లో 57.2, సదాశివపేటలో 56, కొండాపూర్‌లో 50.4 మిల్లీ మీటర్లు చొప్పున వర్షం కురి సింది. డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. సంగారెడ్డిలో 36.3 మి.మీటర్లు, మెదక్‌లో 43.1 మి.మీటర్లు, సిద్దిపేటలో 28.8 మి.మీటర్ల వర్షం కురిసింది.
జలాశయాలు కళకళ
భారీ వర్షాలతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూరు జలాశయానికి 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. డ్యాం గరిష్ట నీటిమట్టం 29 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22 టీఎంసీలకు పెరిగింది. మంజీర జలాశయం లో నిల్వలు 1.5 టీఎంసీలకు పెరిగి గరిష్టస్థాయికి చేరుకోవడంతో గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రెండు వరద తూములను 5 అడుగుల మేర ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంజీ ర డ్యాం నుంచి భారీ వరద వస్తుండటంతో ఘణపూరం ఆనకట్ట అలుగు పొంగిపొర్లుతోం ది. నిజాంసాగర్‌కు భారీగా వరద నీరు పొటెత్తుతోంది. పాపన్నపేట మండలం ఏడుపాయలలోని అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
రాకపోకలు బంద్
ఔటర్ రింగ్ రోడ్డుపై ముత్తంగి జంక్షన్ వద్ద భారీగా నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రాంచంద్రాపురంలోని రాయసముద్రం చెరువు పొంగడం వల్ల జాతీయ రహదారిపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అందోల్ మండలం డాకూరు గ్రామంలో వీరన్న కుంట తెగిపోవడం వల్ల డాకూరు-జోగిపేట, డాకూరు-తాలిల్మ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి జిల్లావ్యాప్తంగా రోడ్లు కోతలకు గురయ్యాయి. గుంతల్లో నీళ్లు చేరడంతో గుర్తించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
బీభత్సం సృష్టించిన జోరువాన
Published Sat, Sep 21 2013 2:37 AM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM
Advertisement
Advertisement