హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరుక్రైం:
హోంగార్డుల సంక్షేమానికి సహాయ సహకారాలు అందజేస్తానని రూరల్ జిల్లా ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ చెప్పారు. నగరంపాలెం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం హోంగార్డు దర్బార్ నిర్వహించారు. ముందుగా హోంగార్డుల సమస్యలను తెలుసుకున్నారు. తమ తెల్ల రేషన్ కార్డులను అధికారులు రద్దుచేశారని, ప్రభుత్వ ఉద్యోగులం కాదని చెప్పినా వినలేదని పలువురు వివరించారు. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే నాణ్యమైన వైద్యచికిత్స అందించలేకపోతున్నామని వాపోయూరు.
హెల్త్‌కార్డులు ఇవ్వటంతోపాటు విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు ఆపద్భందు పథకాన్ని వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో హోంగార్డు మృతి చెందినా, రిటైరైనా జిల్లాలోని హోంగార్డుల నుంచి రూ.100లు చొప్పున వసూలు చేసి ఆ డబ్బును వారి కుటుంబ సభ్యులకు అందించేవారమని, ఈ విధానం కొద్దిరోజులుగా నిలిచిపోయిందని, దీనిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ రామకృష్ణ స్పందిస్తూ విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
హెల్త్‌కార్డులు, ఆపద్బంధు పథకం వర్తింపు, తెల్లరేషన్ కార్డుల తొలగింపు అంశాలను కలెక్టర్ కాంతిలాల్ దండే దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మృతి చెందిన, రిటైరైన హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చేందుకు విరాళాలు వసూలు చేసుకునే అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కొందరు హోంగార్డులపై ఆరోపణలు వస్తున్న దృష్ట్యా డివిజన్ స్థాయి బదిలీలను కొనసాగిస్తామని చెప్పారు. ఎవరైనా సిఫార్సులు చేయిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు.
గురజాల, నరసరావుపేట, గుంటూరు, బాపట్లలో త్వరలో ఏర్పాటు చేయబోయే పోలీసు సబ్సిడీ క్యాంటిన్లలో ప్రతి నెలా రూ.3 వేల విలువైన సరుకులు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, అవినీతికి పాల్పడినా ఉద్యోగం నుంచి తొలగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రామాంజనేయులు, ఏఆర్‌డీఎస్పీ బి.సత్యనారాయణ, ఇన్‌చార్జి హోంగార్డు ఆర్‌ఐ సంకూరయ్య, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.