నష్టపోయిన రైతులకు తక్షణ బీమా | However, instant insurance for farmers | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులకు తక్షణ బీమా

Published Thu, Jun 5 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

నష్టపోయిన రైతులకు తక్షణ బీమా

నష్టపోయిన రైతులకు తక్షణ బీమా

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో పంట నష్టపోయిన శనగ, ఉల్లి రైతులకు చెల్లించాల్సిన బీమా  మొత్తాన్ని తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ బీమా కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జోసఫ్‌కు కడప ఎంపీ వై.ఎస్. అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2011లో ప్రీమియం చెల్లించిన రైతులకు ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఇన్సూరెన్స్ అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర కార్యాలయ అధికారుల దృష్టికి  ఆయన బుధవారం ఢిల్లీలో తీసుకెళ్లారు. కేజీ మార్గ్‌లోని  అగ్రికల్చర్ బీమా కంపెనీ సీఎండీతో దాదాపు అరగంట పాటు రైతుల ఇబ్బందులపై చర్చించారు. అనంతరం అక్కడి  మీడియాతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. ఆమేరకు వివరాలిలా ఉన్నాయి.
 
 ‘ 2011లో రైతులు శనగ పంటకు, ఉల్లి పంటకు ప్రీమియం కట్టారు. దాదాపు మూడేళ్లు గడిచినా నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము అందలేదు. ఈ విషయాన్ని అనేక సార్లు వైఎస్సార్‌సీపీ తరఫున వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని వ్యవసాయ బీమా  కార్యాలయానికి వెళ్లాం. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సైతం స్వయం గా అక్కడి అధికారులతో ఫోన్‌లోనూ మాట్లాడారు. దాదాపు ఐదారుసార్లు ఆ కార్యాలయానికి వెళ్లి ఒత్తిడి తెచ్చాం.
 
 అయినా  ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా అయితే ప్రీమియం కట్టిన  రెండేళ్లలోపే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మూడేళ్లకుపైగా గడిచినా నష్టపోయిన పంటకు సంబంధించి రైతులకు పరిహారం అందకపోవడం చాలా బాధాకరం. హైదరాబాద్ కార్యాలయంలో ఎన్నిసార్లు కలిసినా ఈ విషయంపై స్పష్టత రావడం లేదు.  ఈ విషయాన్ని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం దృష్టికి తెచ్చేందుకు  బుధవారం  అగ్రికల్చర్ బీమా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జోసఫ్‌ను కలిశాం. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు కలగ కుండా వారం నుంచి రెండు వారాల్లో బీమా మొత్తాలు అందేలా కృషి చేస్తామని మాకు సీఎండీ హామీ ఇచ్చారు.
 
 రైతులకు  బీమా అందే వరకు ప్రతి రెండు రోజులకోమారు జోసెఫ్‌గారితో ఫోన్‌లో మాట్లాడతాం.   రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి పోరాడతాం..’ అన్నారు.    తెలంగాణ, సీమాంధ్ర కలిపి రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు రూ. 91 కోట్లు బీమా అందాల్సి ఉందని తెలిపారు. దీనిలో కరువుపీడిత జిల్లా కావడంతో కేవలం వైఎస్సార్ జిల్లాలోనే 40 వేల మంది రైతులకు సుమారుగా రూ. 59 కోట్లు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.  వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని జోసఫ్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement