సాయం కోసం ఎదురుచూపులు
హుద్‌హుద్ బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పునర్ నిర్మాణం పేరిట సంబరాలకు కోట్లు కుమ్మరించిన ప్రభుత్వం కూడా నిధుల కోసం కేంద్రం వైపే చూస్తోంది. తుపాను మర్నాడే కేంద్రం తక్షణ సాయం వెయ్యికోట్లు ప్రకటించినా రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో పరిహారం పంపిణీ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మంగళవారం నుంచి పర్యటించనుంది. దీనిపైనే జిల్లా వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క నిలదీసేందుకూ సిద్ధమవుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను ఫలితంగా విభాగాల వారీగా ట్రాన్స్‌కోకు అత్యధికంగా రూ.1020.88 కోట్ల నష్టం వాటిల్లింది. పాక్షికంగా, తీవ్రంగా, పూర్తిగా దెబ్బ తి న్న ఇళ్లు లక్షా 43 వేల 761 ఉన్నాయి. వీటికి రూ.75.99కోట్లు అవసరమవు తుందని అంచనా. 34,180.22హెక్టార్లలో రూ.49.18కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. 55,334.608 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. ఫిషరీస్ డిపార్టుమెంట్‌కు రూ.38.06కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.124.78కోట్లు నష్టం వాటిల్లగా, వివిధ డిపార్టుమెంట్లకు రూ.7,986.20కోట్ల నష్టంవాటిల్లినట్టుగా లెక్క తేల్చారు.
ఇదంతా ప్రభుత్వపరంగా జరిగిన నష్టమైతే పారిశ్రామిక రంగానికి 50వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. ఇలా దాదాపు రూ.65వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసిన రాష్ర్ట ప్రభుత్వం రూ.21.640.63 కోట్ల సాయం చేయాల్సిందిగా కేంద్రానికి నివేదిక సమర్పించింది. తుపాను వచ్చిన మూడో రోజునే విశాఖ వచ్చిన ప్రధాన మంత్రి రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. రూ.450 కోట్లు రాష్ర్ట ప్రభుత్వానికి విడుదల చేసిందని చెబుతున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా జిల్లాకు కేటాయించలేదు.
దీంతో పరిహారంఅందక ఆదుకునే వారు లేక బాధితులు అల్లాడిపోతున్నారు. నెలన్నర తర్వాత వస్తున్న కేంద్రం బృందం క్షేత్ర స్థాయిలో చూసేది ఏమీ లేకున్నా ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో వీరు ఇచ్చే నివేదికను బట్టే కేంద్రం సాయం ప్రకటించే అవకాశాలుండడంతో జిల్లా ప్రజలతో పాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ బృందం పర్యటనపైనే ఆశలు పెట్టుకుంది.
కేంద్ర బృందం పర్యటన సాగిదిలా: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పాఠక్ నేతృత్వంలోని ఎనిమిది సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం విశాఖకు చేరుకోంది. తొలుత ఎయిర్ పోర్టుకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించి నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని తుఫాన్ నష్టం ఫోటోఎగ్జిబిషన్‌ను తిలకిస్తుంది. మర్నాడు ఉదయం నగరంలో నష్టాన్ని చూసి మధ్యాహ్నం అనంతగిరి వెళ్తుంది. 27న పరిశ్రమలులు..గ్రామీణ జిల్లాను పరిశీలిస్తుంది.
బృందం పర్యటనకు ఏర్పాట్లు
సాక్షి,విశాఖపట్నం: కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. నష్టాలపై బృందానికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. ప్రభుత్వం తరపున నష్టాలను నివేదించేందుకు రాష్ర్టమంత్రిఒకరు రానున్నారని, రాష్ర్టవిపత్తుల నిర్వహణ కమిషనర్ కూడా పాల్గొంటారన్నారు. నాలుగు జిల్లాల్లో జరిగిన తుఫాన్ నష్టాలపై జిల్లాకలెక్టర్ కార్యాలయంలో 28వ తేదీమధ్యాహ్నం వివరించి ఒక నివేదిక అందజేయనున్నట్టుకలెక్టర్ తెలిపారు. నాలుగు జిల్లాల్లో వివిధశాఖలకు తుఫాన్ కారణంగా రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.