సాక్షి, న్యూఢిలీ: పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వాదనలు వేడెక్కాయి. జస్టిస్ బచావత్ నేతృత్వంలోని గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ 1980లో ఇచ్చిన అవార్డును ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేసిందని, దీంతో తాము ముంపునకు గురవుతున్నామని ఒడిశా ప్రభుత్వం వాదించింది. 2007లో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. పలు దఫాల విచారణ అనంతరం తాజాగా బుధవారం ఈ కేసును జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారించింది.
బచావత్ అవార్డుకు కట్టుబడి ఉంటామని ఈ కేసులో భాగస్వామ్య రాష్ట్రాలన్నీ ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించాయి. బుధవారం ఒడిశా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. ‘‘పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. దీనివల్ల నిల్వ నీరు(బ్యాక్ వాటర్) పెరిగి ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు ముంపు ముప్పు వాటిల్లుతోంది. ముంపు ముప్పుపై అధ్యయనం చేయించాలి.’’ అని గోపాల్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జస్టిస్ మదన్ బి.లోకూర్ స్పందిస్తూ.. ‘జాతీయ ప్రాజెక్టులకు అనుమతుల నుంచి మినహాయింపు ఉన్నట్టుంది కదా’ అని అన్నారు. దీనికి సుబ్రహ్మణ్యం.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
బచావత్ అవార్డును ఎక్కడా ఉల్లఘించలేదు: కేంద్రం
కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టు తాజా స్వరూపం బచావత్ అవార్డును ఎక్కడా ఉల్లంఘించి లేదన్నారు. వాద ప్రతివాదులు విచారణ అంశాలను ప్రతిపాదించాలని, ఈ నెల 11న ఈ అంశాలను ఖరారు చేస్తామని సుప్రీం వెల్లడించింది.
డిజైన్‌లపై నేడు ఢిల్లీలో సమావేశం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం డిజైన్‌లను కూడా రూపొందించకపోవడంతో కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, కేంద్రం ఏర్పాటు చేసిన డ్యామ్ డీడీఆర్‌పీతో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ మసూద్ హుస్సేన్ ఢిల్లీలో గురువారం ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 45 డిజైన్‌లకుగాను ఇప్పటివరకు 14 డిజైన్‌లను మాత్రమే సీడబ్ల్యూసీ ఆమోదించింది. మరో 11 డిజైన్‌లను పరిశీలిస్తోంది. ఇప్పటికీ 20 డిజైన్‌లను కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికిగానీ, సీడబ్ల్యూసీకిగానీ సమర్పించలేదు. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ నేరుగా రంగంలోకి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment