సూర్యాపేటరూరల్, కేతేపల్లి, న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన వర్షాలకు మూసీ ఎగువ ప్రాంతాల నుంచి మూసీ ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో మూడేళ్ల తర్వాత అధికారులు ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 644.5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం సాయంత్రం 4, 6వ నంబర్ క్రస్ట్‌గేట్లను అడుగు మేర ఎత్తి 1300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. కనీస నీటిమట్టం 644 అడుగులు ఉండేలా చూస్తూ నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ ఈఈ అమీద్‌ఖాన్ తెలిపారు. దిగువ ప్రాంతాల్లోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమలో మూసీ డీఈ శంక ర్‌రెడ్డి, దేవరకొండ డీఈ సురేందరావు, ఏఈ రమేష్, జేఈలు నవీన్, సత్యనారాయణ, రామకృష్ణ, అజయ్‌యాదవ్ పాల్గొన్నారు. కాగా మూసీ గేట్లు ఎత్తినట్లు తెలియడంతో సమీప ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున ప్రాజెక్టు వద్దకు తరలివచ్చారు. మూసీ అందాలను చూస్తూ సందడి చేశారు.
ఆరేళ్లలో మూడుసార్లు గేట్ల ఎత్తివేత
ఆరేళ్ల కాలంలో మూసీ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను మూడుసార్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. తూపాన్ ప్రభావంతో 2008లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు చేయడంతో తొమ్మిది గేట్లను నెల రోజుల పాటు ఎత్తి ఉంచి రికార్డు స్థాయిలో 10 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. 2009లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. 2010 ఆగస్టులో మళ్లీ ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 20 రోజుల పాటు గేట్లు ఎత్తి ఉంచారు. 2011లో ప్రాజెక్టులో నీటిమట్టం 633 అడుగులకు మించకపోవడంతో ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు నింపడానికి ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలారు. 2012లో నీటిమట్టం 641 అడుగులు దాట లేదు. ప్రస్తుతం ఆగస్టులోనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం, రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మురిసిన మూసీ
Published Tue, Aug 20 2013 4:13 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement