
జంగా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టణంలో నిర్వహించిన ర్యాలీ పండగ వాతావరణాన్ని తలపించింది.
పార్టీ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మాజీ ప్రముఖులు పెద్దసంఖ్యలో వైఎస్సార్ సీపీకి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండీ ఉస్మాన్‌మేస్త్రీ, మాచవరం మాజీ జడ్‌పీటీసీ సభ్యుడు కోనంకి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచి మల్లెల ఆదినారాయణ,సొసైటీ మాజీ అధ్యక్షుడు దాచినేని వెంకయ్య, మాజీ కౌన్సిలర్ నాళం శకుంతల భర్త సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు అత్తోట రామనరసింహరావు తమ అనుచరగణంతో పాల్గొన్నారు. వారితోపాటు 30వార్డుల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది.
ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి పోలీస్‌స్టేషన్ సెంటర్, ఐలాండ్ సెంటర్ల మీదుగా సత్యసాయి కల్యాణ మండపం వరకు ర్యాలీ కొనసాగగా.. ఎక్కడికక్కడ అభిమానులు ఎదురేగి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి రేపాల రమాదేవి, ఆమె భర్త శ్రీనివాసరావులకు ఘనస్వాగతం పలికారు.
కాంగ్రెస్, టీడీపీ మాజీలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో టీడీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న రాజకీయం ఆళ్ల రాకతో ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారిందంటున్నారు. పార్టీ పట్టణ కన్వీనర్ చింతా వెంకట రామారావు, మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.