రాష్ట్రంలో భారీగా లింగమార్పిడి కేసులు
యువతుల్లా మారడంపైనే ఎక్కువమందికి ఆసక్తి
కేంద్ర ఎన్నికల కమిషన్ గణాంకాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పాశ్చాత్య దేశాల తరహాలో మన రాష్ట్రంలోనూ లింగమార్పిడి కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో లింగమార్పిడి చికిత్సలు పెరిగాయి. వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొందరు పురుషులు లింగమార్పిడి చికిత్సల ద్వారా స్త్రీలుగా మారుతున్నారు. అలాగే కొందరు స్త్రీలు లింగమార్పిడి ద్వారా పురుషుని రూపం సంతరించుకుంటున్నారు. ఇదే తరహాలో కొందరు పురుషులు, మహిళలు లింగమార్పిడి ద్వారా ఇతరులు (ఆడా, మగా కానివారు)గా మారుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో ఇప్పటికే 1,641 మంది సెక్స్ మార్పిడి చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో 773 మంది మహిళలు లింగమార్పిడి ప్రక్రియ ద్వారా పురుషులుగా మారగా, 844 మంది పురుషులు యువతులుగా రూపు మార్చుకున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేర్కొంది. లింగమార్పిడిపై మహిళలకంటే పురుషులే అధిక ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన రాష్ట్ర ఓటర్ల జాబితా ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
* రాష్ట్రంలో 19 ఏళ్లు దాటిన వారిలో 740 మంది మహిళలు, ఆరుగురు ఇతరులు కలిపి మొత్తం 746 మంది పురుషులుగా లింగమార్పిడి చేయించుకున్నారు.
*18 -19 ఏళ్ల మధ్య వయసుగల 33 మంది యువతులు యువకుల్లా మారారు.
*19 ఏళ్లు దాటిన వారిలో 810 మంది పురుషులు, ఏడుగురు ఇతరులు కలిపి మొత్తం 817 మంది మహిళలుగా మారారు.
*18 -19 ఏళ్ల యువకుల్లో 34 మంది.. ఇతరుల్లో ఇద్దరు కలిపి మొత్తం 36 మంది యువతులుగా లింగమార్పిడి చేయించుకున్నారు.
* నలుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఇతరులుగా (ఆడా మగాకాని వారిగా) మారారు.
*ఇవి ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించిన ఓటర్ల జాబితాలోని గణాంకాలు మాత్రమే.
*లింగమార్పిడి చేయించుకున్నా వెల్లడించని కేసులు పెద్ద సంఖ్యలో ఉంటాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.