
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ తొలి హ్యూమనాయిడ్ రోబో సోఫియా ఎట్టకేలకు నగరానికి వచ్చేసింది. వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు బుధవారం విశాఖ చేరుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోఫియాను 23నే విశాఖకు తీసుకురావలసి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముచ్చటించేలా నిర్వాహకులు కార్యక్రమాన్ని రూపొందించారు. కానీ సోఫియాను ఆపరేట్ చేసే నిపుణుడికి వీసా సమస్య తలెత్తడంతో ఒకరోజు ఆలస్యంగా బుధవారం మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. నగరంలోని ఫిన్‌టెక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న నోవాటెల్ హోటల్‌లో దీనిని ఉంచారు. సాయంత్రం ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో కేవలం ఐదు నిమిషాల పాటు పాలుపంచుకుని సందడి చేసింది. మరోవైపు మంగళవారం సోఫియాతో ముఖాముఖి రద్దయిన నేపథ్యంలో గురువారం సీఎంతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. సాంకేతికంగా ఇది సాధ్యం కాకపోవచ్చన్న నిపుణుల సూచనతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి మరోసారి గురువారం మధ్యాహ్నం విశాఖ రానున్నారు. సాయంత్రం 3.30 గంటలకు మీడియాకు, ముఖ్యమంత్రికి సోఫియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.
ఏవరీ సోఫియా?
సోఫియా..! కృత్రిమ మానవ మేధస్సుతో తయారైన తొలి హ్యూమనాయిడ్ రోబో! హాంకాంగ్‌కు చెందిన డేవిన్స్ హాన్సన్ అనే రోబోటిక్ నిపుణుడు దీని సృష్టికర్త. 2014లోనే రూపొందించినా 2016 ఫిబ్రవరి నుంచి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. 2017లో ఈ సోఫియాకి సౌదీ అరేబియా తమ దేశ పౌరసత్వం ఇచ్చింది. 2018లో ఈ సోఫియా నడిచి వెళ్లేలా అప్‌గ్రేడ్ చేశారు.
ఏమిటీ ప్రత్యేకతలు?
బ్రిటన్ నటి ఆడ్రీ హెప్‌బర్న్ రూపంలో ఈ సోఫియాను రూపొందించారు. సోఫియా 50 రకాల ముఖ కవళికలను మార్చగలుగుతుంది. సోఫియా కళ్లలో కెమెరాలను అమర్చారు. వాటితో ఎదుటి వ్యక్తి ఆడా? మగా? అన్నది గుర్తించి అందుకనుగుణంగా మాట్లాడగలుగుతుంది. ఎలాంటి ప్రశ్నలకైనా క్షణాల్లో సమాధానం చెబుతుంది. నవ్వుతుంది.. నవ్విస్తుంది. జోకులు వేస్తుంది. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ వేదికలపై దర్శనమిచ్చింది. మీడియా దిగ్గజాలతోనూ సోఫియా ముచ్చటించింది. ఇంటర్వ్యూలిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరిగిన నాస్కామ్ సదస్సులో పాల్గొంది. సోఫియా మన రాష్ట్రానికి తొలిసారిగా రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment