
'ఎర్ర’ స్మగ్లర్ల కోసం వేట
శేషాచలాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు
అదుపులో 310 మంది దొంగ కూలీలు
ముగ్గురు తమిళ స్మగ్లర్ల అరెస్ట్
వివిధ ప్రాంతాల్లో కూలీల అరెస్టులు..
కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత
గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి..
తిరుమల శేషాచల అడవిలో ఇద్దరు అధికారులను హత్య చేసి మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిన ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం పోలీసులు ఆదివారం రాత్రి నుంచే వేట ప్రారంభించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లిన 14 కూంబింగ్ బృందాలు స్మగ్లర్లు, కూలీల కోసం ముమ్మర గాలింపు చేపట్టాయి. వీరితోపాటు చిత్తూరు, వైఎస్‌ఆర్‌జిల్లా, కర్నూలుకు చెందిన పోలీసులు కూడా పాల్గొన్నారు. చెన్నై రైళ్లపై నిఘా పటిష్టం చేసి విసృ్తత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుమల, రేణిగుంట, తిరుపతిల్లోని ఎంఆర్ పల్లి, శ్రీకాళహస్తి, కల్యాణిడ్యామ్, మామండూరు రైల్వేస్టేషన్, చిత్తూరు ప్రాంతాల్లో 310 మందిని అరెస్టు చేశారు. తిరుమలలో పట్టుబడిన వారిని విచారించడంతో అటవీశాఖ అధికారులపై దాడి చేసినట్లు ముగ్గురు అంగీకరించారు. తిరుమలలో అరెస్టయిన 107 మందిని తిరుపతి టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో విచారిస్తున్నారు. మిగిలిన వారిని రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శేషాచలం అడవుల నుంచి తమిళనాడుకు వెళ్తున్న వంద మంది ఎర్రచందనం కూలీలను చిత్తూరు చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. వైఎస్‌ఆర్ జిల్లా రైల్వేకోడూరు పోలీసులు ముంబై వెళ్లే జయంతి ఎక్స్‌ప్రెస్‌ను తనిఖీ చేసి దీనిలోని 48 మంది కూలీలను తిరుపతికి తరలించారు.
ముగ్గురూ తమిళ స్మగ్లర్లే..: అటవీ శాఖాధికారులపై దాడి, హత్య ఘటనకు సంబంధించి ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు సోమవారం మీడియాకు తెలిపారు. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరు తాలూకాలోని కల్లపూరుకు చెందిన గోవిందరాజులు, చవదన్‌కాళి కాళహస్తి, అదేతాలూకా కిల్లనూరుకు చెందిన రామస్వామి అలియాస్ మాదిగాలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అధికారులపై కర్రలు, బండలతో దాడిచేసినట్టు వారు అంగీకరించారని.. మరణించిన అధికారులు శ్రీధర్, డేవిడ్‌ల సెల్‌ఫోన్లు, ఉంగరాలు, నగదును వీరి నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 147, 148, 341, 302, 307, 332, 333, 120బి, 149 కింద, అటవీ చట్టం 21 ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఇలాం టి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా 20 మంది సాయుధ పోలీసులను అటవీశాఖకు అప్పగిస్తున్నామన్నా రు. ఇదిలావుంటే.. తిరుపతి అటవీశాఖ కార్యాలయంలో అడవుల పరిరక్షణ ప్రధానాధికారి సోమశేఖర్‌రెడ్డితో పాటు స్పెషల్ పీసీసీఎఫ్ ఎస్.బి.సి.మిశ్రా, సీఎఫ్‌ఓ రవికుమార్, డీఎఫ్‌వోలు సమావేశమై దాడి ఘటనపై సమీక్షించారు.
కుటుంబ సభ్యులకు మృత దేహాల అప్పగింత: స్మగ్లర్ల దాడిలో చనిపోయిన అటవీ అధికారుల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం సోమవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీధర్ మృతదేహాన్ని ర్యాలీగా తీసుకెళ్లి తిరుపతి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించగా, డేవిడ్ మృతదేహాన్ని తిరుపతి వెస్ట్ చర్చికి తరలించి ప్రార్థనల అనంతరం అంత్యక్రియలు నిర్వహించా రు. మరోపక్క ఇదే దాడిలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందు తున్న అధికారులు కోలుకుంటున్నారు.
ఆయుధాల కోసం సిబ్బంది ఆందోళన: తిరుపతిలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద సోమవారం జిల్లా అటవీశాఖ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విధుల్లో తమకు ఆయుధాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆయుధాలు అందిస్తామని అడవుల పరిరక్షణ ప్రధానాధికారి బి.సోమశేఖర్‌రెడ్డి హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
గవర్నర్ దిగ్భ్రాంతి
అటవీ అదికారులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి, ఇద్దరు అధికారుల హత్యలపై గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరాచక శక్తులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు.