అనుమానం పెనుభూతమైంది. దీనికి మద్యం రక్కసి తోడైంది. తాళికట్టిన భార్యపై మద్యం మత్తులో ఓ భర్త దాడికి తెగబడ్డాడు.
విజయనగరం/కొట్టాం(శృంగవరపుకోట): అనుమానం పెనుభూతమైంది. దీనికి మద్యం రక్కసి తోడైంది. తాళికట్టిన భార్యపై మద్యం మత్తులో ఓ భర్త దాడికి తెగబడ్డాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు. మండలంలోని కొట్టాం గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొట్టాం గ్రామానికి చెందిన సింగిడి శ్రీను, రమణమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కావటంతో అత్తవారింట ఉంటోంది. కొడుకు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ వేరొక చోట ఉంటున్నాడు.
శ్రీనుకు భార్య రమణమ్మ ప్రవర్తనపై అనుమానం ఉంది. గతంలో పలు దఫాలు ఆమెను హెచ్చరించాడు. ఇదే విషయమై బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ గొడవ పడ్డారు. ఆవేశంలో శ్రీను భార్యపై కత్తితో దాడి చేశాడు. తర్వాత క్రిమిసంహారక గుళికలు తిని వాంతులు చేసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు 100కు సమాచారం ఇవ్వటంతో ఎస్.కోట పోలీసులు వారిద్దరిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు పోలీసులు తెలిపారు.