
ఆ బాంబులు నేనే కూర్చాను
గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో వాడిన బాంబులు తానే తయారు చేశానని ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహచరుడు అసదుల్లా అక్తర్ అంగీకరించాడు.
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లపై భత్కల్ సహచరుడు అక్తర్ వాంగ్మూలం
న్యూఢిల్లీ: గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో వాడిన బాంబులు తానే తయారు చేశానని ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహచరుడు అసదుల్లా అక్తర్ అంగీకరించాడు. నాడు బాంబులను తయారు చేసి, వాటిని ఎలా పేల్చాలన్న విషయంలో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ సభ్యులకు మార్గదర్శనం చేశానని తెలిపాడు. ఈ మేరకు గత అక్టోబర్‌లో మేజిస్ట్రేట్‌కు వాం గ్మూలమిచ్చాడు. దీన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఢిల్లీ కోర్టులో దాఖలు చేసింది. యాసిన్ భత్కల్, అక్తర్, మరో ఇద్దరు ఉగ్రవాదులపై చార్జిషీట్లు దాఖలు చేసింది. వాంగ్మూలం వివరాలివీ..
''ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్(ఐఎం సహ వ్యవస్థాపకుడు) సూచనల మేరకు నేను దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో బాంబు పేలుళ్లు నిర్వహించాను. 2012 డిసెంబర్‌లో రియాజ్, నేను మాట్లాడుకున్నాం. హైదరాబాద్‌లో ఏదో ఒకటి చేయాలనుకున్నాం. అదే నెలలో మాకు హవాలా ద్వారా బెంగళూరుకు డబ్బులు వచ్చాయి. గతేడాది జనవరిలో రియాజ్ నుంచి పేలుడు పదార్థాలు అందాయి. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 18న దిల్‌సుఖ్‌నగర్‌లో రెక్కీ చేశాం. బాంబు పేల్చడానికి తగిన ప్రాంతాల్ని నేను నిర్ణయించాను. మూడు చోట్ల పేలుళ్లు చేపట్టాలనుకున్నా.. పేలుడు పదార్థాలు సరిపోకపోవడంతో రెండు చోట్లే బాంబులు పేల్చడానికి సిద్ధమయ్యాం. దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు చేపట్టడానికి ముందు శాంపిల్‌గా చిన్న పేలుడు కూడా నిర్వహించి చూశాం. అంతా ఓకే అనుకున్నాక.. నేను పేలుడు పదార్థాలను కూర్చాను. ఉగ్రవాది మోను.. ఏ1 మిర్చి సెంటర్ వద్ద, వకాస్ దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ వద్ద బాంబులు పెట్టారు. ఆ సమయంలో నేను వారి దగ్గరలోనే ఉన్నాను'' అని అసదుల్లా అక్తర్ చెప్పాడు.