మహేష్‌బాబుకు మరదలిగా నటిస్తున్నా
వర్ధమాన నటి కారుణ్య చౌదరి
కొయ్యలగూడెం :కొరటాల శివ దర్శకత్వంతో మహేష్‌బాబు హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో ఆయన్ను ఆట పట్టించే కొంటె మరదలుగా నటిస్తున్నట్లు వర్ధమాన నటి కారుణ్య చౌదరి తెలిపారు. బయ్యనగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలకు ఆమె దర్శకుడు జంగాల నాగబాబుతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బయ్యనగూడెం గ్రామానికి చెందిన నాగబాబు కోరిక మేరకు అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి మరికొందరు నటులు, డెరైక్టర్లు, కో-డెరైక్టర్లతో రెండ్రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.
కాకినాడకు చెందిన తాను హైదరాబాద్‌లో స్థిరపడినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం తననెంతో ఆకర్షించినట్టు తెలిపారు. ఇంతకు ముందు శ్రీమంతుడు సినిమాలో నటించానని తెలిపారు. దర్శకుడు నాగబాబు మాట్లాడుతూ ప్రస్తుతం తన దర్శకత్వంలో ‘మా ప్రయత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నామని, దీన్లో కారుణ్యచౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలిపారు. కోరుమామిడిలో ఈ నెల 15వ తేదీన షూటింగ్ ప్రారంభించామని, పోలవరం, పట్టిసీమ, బందకట్టు, జల్లేరు, మద్ది తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు నటి కారుణ్య బహుమతి ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్‌లు,
ప్రజాప్రతినిధులు కారుణ్య చౌదరిని శాలువాలతో సత్కరించి మెమెంటోను అందజేశారు. కో-డెరైక్టర్ సోమ సాయిరామకృష్ణ, అసోసియేట్ డెరైక్టర్ కరుటూరి బుల్లబ్బాయి, సీనియర్ నటులు నల్లూరి వెంకటరావు, ఆలయ కమిటీ
సభ్యులు పాల్గొన్నారు.