తెలంగాణపై నిర్ణయం మారదు
Published Tue, Sep 3 2013 4:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
భీమ్‌గల్, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. భీమ్‌గల్ ఆర్టీసీ బస్టాండు ఆధునికీకరణ పనులకు సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌లు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీడబ్ల్యూసీ ఒకసారి తీసుకున్న నిర్ణయానికి తిరుగుండదన్నారు. మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు. అంతవరకు తెలంగాణవాదులందరూ ఓపికగా ఉం డాలన్నారు.
సీమాంధ్రలో కొందరు ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణపై వెనక్కి చూసేది లేదని సోనియా చెప్పారన్నారు. తెలంగాణ రాష్ర్టం ఇచ్చిన ఘనత కేవలం సోనియాగాంధీకి మాత్రమే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ అభివృద్ధి పట్ల మం చి చిత్తశుద్ధి ఉన్న యువకుడన్నారు. ఆయన అమెరికాలో చూసిన అభివృద్ధిలో కొంతైనా ఇక్కడ సాధించాలన్న తపనతో ఉన్నాడని అన్నారు. డిపోతో సంబంధంలేకుండా ప్రజలకు రవాణా వసతిని కల్పిం చామ న్నారు. ఆర్టీసీ బస్సులు మనవని, వాటి ని వాడుకోవాలని సూచించారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దన్నారు.
ఇప్పుడు వేసిన బస్సులు విజయవంతమైతేనే డిపో వస్తుందన్నారు. 40 ఏళ్ల తరబడి కలగన్న మెడికల్ కళాశాలను సాధించామన్నారు. అయినా దీనిపై నేను సంతోషంగాలేనని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిం చి, ప్రజలు ఎలాంటి వైద్యం కోసమైనా హైదరాబాద్‌కు వెళ్లే అవసరం లేకుండా చేసిననాడే తృప్తి పడతానని అన్నారు. అనంతరం బస్టాం డు ప్రాంగణంలోకి చేరుకుని పరిశీలించారు. జెండాలు ఊపి బస్సు సర్వీసులను ప్రారంభించారు. సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార, ఆర్టీసీ ఈ డీ పురుషోత్తం నాయక్, ఆర్‌ఎం కృష్ణకాంత్, ఆర్మూర్ డీఎం రాజమౌళి, స్థానిక సర్పంచ్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement