
గోదారమ్మా.. నీకు వందనం
పావన వాహిని మహాపర్వం అట్టహాసంగా ముగిసింది. ఎందరికో తీపి జ్ఞాపకాలను.. కొందరికి చేదు అనుభవాలను మిగిల్చి కాలప్రవాహంలో కలిసిపోయింది.
పావన వాహిని మహాపర్వం అట్టహాసంగా ముగిసింది. ఎందరికో తీపి జ్ఞాపకాలను.. కొందరికి చేదు అనుభవాలను మిగిల్చి కాలప్రవాహంలో కలిసిపోయింది. 2027లో వచ్చే పుష్కరాల వరకు గుర్తుండేలా ఇప్పటి పాలకులకు, అధికారులకు గుణపాఠం నేర్పింది. కేవలం ప్రచారయావ తప్ప యాత్రికులకు, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని పాలకుల నిర్లక్ష్యం ఎన్ని పుష్కరాలకైనా మాయనిమచ్చలా మిగిలిపోనుంది. రాజమండ్రిలో తొలిరోజు 29మంది మృత్యువాత పడిన ఘోర విషాద ఘటన పొరుగునే ఉన్న పశ్చిమ వాసులనూ కలవరపర్చింది. ఇక ఎన్నో వ్యయ ప్రయాసలు, దూరాభారాలకోర్చి వచ్చిన యాత్రికులు ప్రభుత్వ అరకొర ఏర్పాట్లు నరకయాతన అనుభవించేలా చేసినా.. గోదారి బిడ్డల ఔదార్యానికి, దాతృత్వానికి, సహాయ గుణానికి పరవశిం చిపోయారు. ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలతో తిరుగు పయనమయ్యారు.
కేంద్రమంత్రులు.. ప్రముఖులు ఎక్కడ?
కుంభమేళా తరహాలో నిర్వహించే పుష్కరాలకు దేశ, విదేశీ ప్రముఖులను తీసుకువస్తామని ఈ ప్రాంత వైశిష్ట్యాన్ని నలుచెరగులా వ్యాపింపజేస్తామని పాలకులు తొలుత ఆర్భాటంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చే అవకాశముందని సీఎం చంద్రబాబు.. రాష్ట్రపతికి, ఉపరాష్ర్టపతికి స్వయంగా ఆహ్వానం ఇచ్చామని జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు డాంబికాలు పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా 18మంది కేంద్రమంత్రులు గోదావరి పుణ్యస్నానాలకు తరలిరానున్నారని మాణిక్యాలరావు ఒకటికి పదిసార్లు చెప్పారు. కానీ మన రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు మినహా మరే ఇతర కేంద్రమంత్రి పుష్కర స్నానానికి వచ్చిన దాఖలాలు లేవు.
ఇక గోదావరి తీర ప్రాంత ఎంపీ మురళీమోహన్ సినీ నేపథ్యంతో తారలు దిగివస్తారని సగటు సినీ అభిమానులు ఆశించారు. ఒకరిద్దరు ప్రముఖులు తప్ప చలన చిత్రదిగ్గజాలే కాదు మినీ స్టార్లూ రాలేదు. రాజకీయ, సినీ ప్రముఖుల రాక ఏమోగానీ.. గోదారమ్మ చల్లని ఆశీస్సులు పొందేందుకు భక్తజనం ఊహించని విధంగా పోటెత్తింది. కానీ.. ప్రభుత్వ ఏర్పాట్లు అడుగడుగునా వెక్కిరించాయి. ‘రండి రండి.. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తున్నాం. పుణ్యస్నానం చేసి తరించండి..’ అంటూ మూడునెలలుగా విపరీతమైన ప్రచారంతో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా రెండు నెలల ముందు నుంచే ఆదరాబాదరగా పుష్కర పనులు చేపట్టింది.
అప్పుడు వేధింపులు.. ఇప్పుడు అభినందనలు
జిల్లాలో చేపట్టిన పనుల్లో పుష్కరాలు మొదలయ్యే నాటికి 70శాతం కూడా పూర్తి కాలేదు. అరకొర పనుల మధ్యనే పుష్కరాలు మొదలు కాగా, పూర్తయ్యేనాటికి కూడా ఇంకా కొన్ని పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఆ పనులు కూడా ఉన్నతాధికారులు రాత్రిపగలు తేడా లేకుండా వెంటపడితేగానీ పూర్తి కాలేదనేది నిర్వివాదాంశం. తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ దశలో జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌పై కాంట్రాక్టర్లు, అధికారులు తిరగబడే పరిస్థితి వచ్చినా... పుష్కరాలు పూర్తయిన తర్వాత కలెక్టర్‌ను అభినందిస్తున్నారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఒళ్లు హూనమయ్యేలా పనిచేయడం వల్లనే ఉన్నంతలో గట్టెక్కగలిగామనేది అధికారవర్గాల వాదన.
ఈ క్రమంలో జిల్లాలో పుష్కరాల విజయవంతం క్రెడిట్ తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్న అధికారులు పుష్కరాల పేరుతో అడ్డంగా రూ.కోట్లు దోచేసిన అక్రమార్కులను వెలికితీసి వారి ఆట కట్టిస్తారో లేదో చూడాలి. పుష్కరాలు మా కష్టం వల్లే జయప్రదమయ్యాయని ఎవరెన్ని గొప్పలు చెప్పుకున్నా.. నిజాలకు సజీవ సాక్ష్యంగా పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతున్న తెలుగువాడి జీవనాడి గోదారమ్మ తల్లికి వందనం.
-జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు