సాక్షి, హైదరాబాద్ : కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ‍్యవహరిస్తున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నలుగురు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై తక్షణ చర్య తీసుకోవాలని ఆయన గురువారమిక్కడ డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలతో కలిసి ప్రలోభాలకు గురి చేస్తూ.. పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వజూపుతూ అనైతికంగా వ్యవహరిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు రాజమౌళి, సాయిప్రసాద్ తో పాటు ఐపీఎస్ అధికారి ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల వ్యవహార శైలిని ఆయన తప్పుబట్టారు. ఇటీవల చోటు చేసుకున్న పార్టీ ఫిరాయింపుల్లో వీరి ప్రమేయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉందని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా తనవద్ద ఉన్నాయని సాయిరెడ్డి తెలిపారు. తాము చేసిన ఆరోపణలు బయటపెట్టాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోరుకుంటే కచ్చితంగా ఆధారాలు చూపిస్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో తమ ఆరోపణలు నిజమని తేలాయని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment