కూనిరాగాలే సినీగానాలయ్యాయి
పిఠాపురం : సరదాగా తీసిన కూని రాగాలే తన కెరీర్‌ను మలుపు తిప్పి సినీగానాలుగా మారాయని యువ గాయని టి.ప్రణవి తెలిపారు. ఆదివారం ఆమె పిఠాపురం పాదగయక్షేత్రంలో శ్రీకుక్కుటేశ్వరస్వామిని, శ్రీపురుహూతికా అమ్మవారిని, శ్రీరాజరాజేశ్వరిదేవిని, దత్తాత్రేయస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు ఆమెను ఆశీర్వదించగా అధికారులు ప్రసాదాలందజేశారు. ఆమె శ్రీరాజరాజేశ్వరిదేవిపై ‘శృతి నీవు గతి నీవు’ గీతాన్ని ఆలపించారు. ఆమె వెంట తండ్రి టి.విజయకుమార్, ఉంగరాల వెంకటేశ్వరరావు, ఎలుబండి ప్రభు తదితరులున్నారు. ఆ సందర్భంగా ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ.
సాక్షి: మీ కుటుంబ నేపథ్యం?
ప్రణవి: స్వస్థలం ముమ్మిడివరం దగ్గర కొత్తలంక. కొంత కాలం కాకినాడలో ఉన్నాం. మా అమ్మ వైణికురాలు, నాన్న రచయిత. దూరదర్శన్‌లో పని చేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
సాక్షి: సంగీతం పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
ప్రణవి: సంగీతంలో బీఏ చేశాను. కుటుంబానికి ఉన్న సంగీత నేపథ్యంలో చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల ఆసక్తి ఉండేది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నా గాయని అవుతానని ఊహించలేదు.
సాక్షి: సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారు?
ప్రణవి: వైజే బాలసుబ్రహ్మణ్యం, హేమావతి, రామాచారిల వద్ద.
సాక్షి: తొలుత పాటలు పాడే అవకాశం ఎలా వచ్చింది?
ప్రణవి: ఖాళీగా ఉన్నప్పుడు కూనిరాగాలు తీయడం అలవాటు. హైదరాబాద్‌లో ఒక సినిమా ఫంక్షన్‌లో కూనిరాగాలు తీస్తుంటే దర్శకుడు ఆదిత్య విని సంగీత దర్శకుడు కళ్యాణ్‌మాలిక్‌కు పరిచయం చేశారు. ఆయన కొన్ని పాత పాటలు పాడించి, ‘ఆంధ్రుడు’లో రెండు పాటలు పాడించారు. అలా అనుకోకుండా సినీరంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు సినిమాల్లో, సూపర్‌సింగర్స్, స్వరాభిషేకం కార్యక్రమాల్లో పాటలు పాడుతున్నాను.
సాక్షి: మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు?
ప్రణవి: ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, చక్రి, వందేమాతరం శ్రీనివాస్, కోటి తదితరులు ఎంతో ప్రోత్సహించారు. ‘శ్రీరామదాసు’లో ‘శుద్ధబ్రహ్మ’ పాట పాడించి సినీరంగంలో నిలదొక్కుకునేలా చేశారు కీరవాణి.
సాక్షి: ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు, పేరు తెచ్చిన పాటలు?
ప్రణవి: 150 సినిమా పాటలు పాడాను. ‘యమదొంగ’లో ‘రబ్బరుగాజులు’ పాటతో పాటు ‘పాండురంగడు, హ్యాపీడేస్’ సినిమాల్లో పాటలు మంచిపేరు తెచ్చిపెట్టాయి.
సాక్షి: కొత్తగా పాడిన పాటలు?
ప్రణవి: ‘అలా ఎలా, ఈ వర్షం సాక్షిగా, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమాలతో పాటు ఇంకా పేరు పెట్టని పలు సినిమాలకు పాడాను.
సాక్షి: ఏమైనా అవార్డులు సాధించారా?
ప్రణవి: ఇప్పటి వరకు రెండు నంది అవార్డులు పొందాను. చిన్నచిన్న అవార్డులు చాలా వచ్చాయి.
సాక్షి: ఇంకే కళలోనైనా ప్రావీణ్యం ఉందా?
ప్రణవి: కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం ఉంది. విదేశాలలోనూ సంగీత, నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. పాటలు పాడాను.