ఆత్మహత్య చేసుకుందామనే వెళ్లాను : వంశీకృష్ణ
విజయవాడ: అనేక మందిని మోసం చేసి, చివరకు తాను చనిపోయినట్లు కూడా నమ్మించిన మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నార్ల వంశీ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుందామనే వెళ్లానని చెప్పాడు. కానీ చివరి నిమిషంలో విరమించుకున్నట్లు తెలిపాడు.
తన కేసులో రాజకీయ నేతల హస్తంలేదని చెప్పాడు. అందరూ తన వల్ల లబ్దిపొందినట్లు తెలిపాడు. 4 కోట్ల రూపాయలకు మించి బాకీలు లేవన్నాడు.
వంశీ కృష్ణ గతంలో ఓ పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా కూడా పనిచేశాడు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఓ తెలుగుదేశం పార్టీ నేత, ఓ సిఐ అండదండలతోనే వంశీ కృష్ణ అనేక మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నకిలీ డాక్యుమెంట్లు, ఒకే ఫ్లాట్ను ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయడం, బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందడం.... వంటి అనేక కేసులు అతనిపై ఉన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలలో అతనిపై పది కేసులు నమోదయ్యాయి. వంశీ కృష్ణను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
వంశీ కృష్ణ చేతిలో మోసపోయినవారు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని డిసిపి రవిప్రకాష్ కోరారు. అతనికి పోలీసు శాఖలో ఎవరైనా సహకరించినా వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.