స్త్రీలోలుడిపై సీపీకి ఫిర్యాదు
*మరో ఇద్దరికి వల
* యువకుడి రాసలీలలు
*సీపీని కలిసిన బాధితులు
విజయవాడ: ఒకరు మాజీ ప్రేమికురాలు.. మరొకరు భర్తను కాదని "సాంగత్యం' సాగిస్తున్న మహిళ.. తమతో కాకుండా మరో ఇద్దరితో అతడు ప్రేమాయణం సాగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమను మోసం చేసిన వ్యక్తి మరో ఇద్దరి జీవితాలతో ఆటాడుకోవడానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అంతే మహిళా సంఘాలతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. తమను మోసగిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన న్యాయం చేస్తానని మహిళలకు పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే... నగరంలోని మల్లికార్జునపేటకు చెందిన సత్యకుమార్ దుర్గగుడిపై అమ్మవారి ఫొటోలు విక్రయిస్తుంటాడు. అదే ప్రాంతంలో అమ్మవారి ఫొటో ఫ్రేములు కట్టే వ్యక్తితో ఉన్న పరిచయం ఆధారంగా తరచూ అతను.. వారింటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతని భార్యపై కన్నేశాడు. ఒకసారి భర్త లేని సమయంలో ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆపై ఆమెను ఇతర ప్రాంతాలకు తిప్పి తన కోరికలు తీర్చుకున్నాడు.
ఇదే ప్రాంతానికి చెందిన మరో యువతితో ఐదేళ్లపాటు ప్రేమాయణం సాగించాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించగా, మరొకరిని వివాహం చేసుకుంది. ఆమె భర్తకు విషయం చెప్పి కాపురాన్ని చెడగొట్టాడు. ఆ తర్వాత ఆమెతో కూడా ప్రేమను పంచుకుంటున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ఉంటూ తన వాంఛ తీర్చుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఫ్రేములు కట్టే వ్యక్తి భార్యతో ఊరెళ్లి కొద్దిరోజులు గడిపిన తర్వాత తీసుకొచ్చి విజయవాడలో వదిలేశాడు.
ఈ విషయం కాస్తా ప్రస్తుతం కాపురం చేస్తున్న మాజీ ప్రేమికురాలికి తెలిసి సత్యకుమార్‌ను నిలదీయగా.. చంపుతానని బెదిరించాడు. చేతనైంది చేసుకొమ్మన్నాడు. ఇతడి గురించి ఆరా తీసి మరో ఇద్దరు విద్యార్థినులతో ఇతడు సంబంధం నెరుపుతున్నట్టు తెలుసుకున్నారు. వారిని ఇతడి బారి నుంచి రక్షించాలని నిర్ణయిం చుకున్నారు. అక్కడ మహిళా నేతలను ఆశ్రయించారు.
ఆ మహిళ నేతలతో కలిసి మంగళవారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావును కలిశారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు. మరో ఇద్దరు యువతులు మోసపోకుండా చూడాలన్నారు. వీరి విషయాన్ని సావధానంగా విన్న పోలీసు కమిషనర్.. తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్‌తో చెప్పారు.
ఆ ఇద్దరు మోసపోకూడదనే..
తమలా మరో ఇద్దరు మోసపోకూడదనే నగర పోలీసు కమిషనర్‌ను కలిసినట్టు బాధిత మహిళలు విలేకరులకు తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అతని కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు.