బరువు పెరిగారంటే ఎస్సీ ఎస్టీ కేసా?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మీద తాను ఎలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయలేదని పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అన్నారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించిన తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు అనితతో వివాదం ఏంటని మీడియా ప్రశ్నించగా.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఓ సందర్భంలో అనిత అన్నారని.. దాని మీద తాను స్పందించి ఆమె అభివృద్ధి (బరువు పెరగడం) కనిపిస్తోంది గానీ, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనపడటం లేదని సోషల్ మీడియాలో పంచ్ వేశానని చెప్పారు. అంతకుముందు కూడా సమైక్య రాష్ట్రం 23 జిల్లాలతో లోకేష్‌లా లావుగా ఉండేదని, తర్వాత 13 జిల్లాలతో స్లిమ్ అయ్యిందని తాను ఒక పంచ్ వేశానన్నారు. ఇలా బరువు పెరగడం గురించి మాట్లాడటమే తప్పంటే అలాంటివి చాలా ఉంటాయని తెలిపారు. వెయిట్ లాస్ ప్రకటనల విషయంలో కూడా బిఫోర్, ఆఫ్టర్ అంటూ మహిళలకు సంబంధించిన రెండు ఫొటోలతో పెద్దపెద్ద ప్రకటనలు ఇస్తారని, అది మహిళలను అవమానించడం అయితే ఆ యాడ్ ఇచ్చినవాళ్ల మీద, ప్రకటనలు ప్రసారం చేసిన మీడియా మీద కూడా కేసులు పెట్టాలని ఆయన చెప్పారు.
తనను తుళ్లూరు పోలీసులు గతంలో విచారించినప్పుడే తాము తలుచుకుంటే ఏమైనా చేస్తామని, మొద్దు శీనుకు ఏం జరిగిందో తెలుసు కదా అని బెదిరించారని.. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా తమకు సంబంధం లేదని చెప్పారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వాయిస్‌ను అణగదొక్కాలన్న లక్ష్యంతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ఇదే విశాఖలో ఆర్కే బీచ్‌లో బికినీ ఫెస్టివల్ పెట్టారని, దాన్ని సోషల్ మీడియా గట్టిగా చెప్పడంతో తర్వాత కాస్త వెనక్కి తగ్గారని అన్నారు. అప్పట్లో అనితగారు బికినీ వేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారని, నిజానికి అది మహిళలను అవమానించడం అవుతుంది గానీ, గ్రోత్ అంటే అవమానించడం కాదని తెలిపారు. తాను ఈ తరహాలో ఎప్పుడూ ఊహించలేదని, తొలిసారి విచారణలో పోలీసులు చెప్పినట్లే ఇప్పుడు కూడా చేశారని, వాళ్లు అనుకున్నది సాధించారని రవికిరణ్ అన్నారు. ఆయన మీద 292, 509 సెక్షన్ల కింద, మహిళలపై వేధింపులకు గాను సెక్షన్ 6 కింద, ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టంలోని సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు.