రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2014 షెడ్యూల్ విడుదలైంది.
హన్మకొండ(వరంగల్ జిల్లా), న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2014 షెడ్యూల్ విడుదలైంది. ఇక్కడి కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్‌హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐసెట్ చైర్మన్, కేయూ వీసీ బి.వెంకటరత్నం ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 14న ఐసెట్-2014 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, మే 23న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. వివరాలివీ..
అభ్యర్థులు ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 25 వరకు, రూ.5,000 అపరాధ రుసుంతో మే ఆరు వరకు, రూ.పదివేల అపరాధ రుసుంతో మే 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏప్రిల్ 21 నుంచే అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ప్రవేశ పరీక్ష మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది.
- ప్రిలిమినరీ కీని మే 26న విడుదల చేస్తారు. అభ్యంతరాలను జూన్ 3 వరకు స్వీకరిస్తారు. ఫైనల్ కీ, ప్రవేశపరీక్షల ఫలితాలను జూన్ 9న విడుదల చేస్తారు.
- అభ్యర్థులు www.apicet.org.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర సమాచారంకోసం ్ఛఝ్చజీ: convernericet2014@gmail.com ను సంప్రదించవచ్చు.
కొత్తగూడెంలో పరీక్ష కేంద్రం..
ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా మాట్లాడుతూ.. గత ఐసెట్‌లో రీజినల్ సెంటర్లు 29 ఉండగా, ఈసారి ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని అభ్యర్థుల సౌకర్యార్థం కొత్తగూడెంలో కొత్తగా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి ఓఎంఆర్ షీట్‌పై పెన్సిల్‌ను వాడొద్దని, బ్లూ లేదా బ్లాక్ పాయింట్‌పెన్‌నే ఉపయోగించాలని సూచించారు. పరీక్ష హాల్లోకి రావడం నిమిషం ఆలస్యమైనా అనుమతించరని తెలిపారు. సమావేశంలో ఉన్నత సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ విజయప్రకాశ్, సెక్రటరీ కె.సతీష్‌రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ కె.సాయిలు, ఐసెట్ కన్వీనర్ ఓంప్రకాశ్ పాల్గొన్నారు.