
‘బొగ్గు’ ఫైల్స్ పోతే ప్రభుత్వమూ పోయినట్టే: వెంకయ్య
బొగ్గు గనుల కేటాయింపు ఫైళ్లు పోతే కాంగ్రెస్ ప్రభుత్వమూ పోయినట్టేనని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల కేటాయింపు ఫైళ్లు పోతే కాంగ్రెస్ ప్రభుత్వమూ పోయినట్టేనని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం బరి తెగించిందనే దానికి ఈ ఫైళ్ల గల్లంతే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. వాటిని కావాలనే మాయం చేశారని, అవి దొరక్కపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారంలో దోషే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రకాష్ జైస్వాల్ అయితే ఆయనతో పార్లమెంటుకు జవాబిస్తామనడం దారుణమన్నారు. ప్రధానే దీనిపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. రక్షా బంధన్ సందర్భంగా బుధవారమిక్కడ ఆయన పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, వై.రఘునాధ్‌బాబు, మల్లారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
దేశ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా తయారైందని, వారం రోజుల్లో మార్కెట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు నష్ట పోయిందని చెప్పారు. రూపాయి తరుగుతోంది, విదేశీ మారక ద్రవ్యం కరుగుతోంది, ప్రభుత్వం నిద్రపోతోందని ఎద్దేవా చేశారు. డాలర్ ఎస్కలేటర్‌పైన, రూపాయి వెంటిలేటర్‌పైన, ప్రభుత్వం ఐసీయూలో ఉందన్నారు. ఇటువంటి అధ్వాన్న, అసమర్థ, బలహీన, అవినీతి ప్రభుత్వం ఎంత త్వరగా పోతే అంతమంచిదని ప్రజలు భావిస్తున్నట్టు తెలిపారు. ఆహార భద్రత బిల్లుకు తాము సూత్రరీత్యా వ్యతిరేకం కాకపోయినా అందులో రైతుకు వనగూరే ప్రయోజనాలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
బిల్లు పార్లమెంటులో ఉండగానే ఆహార పథకాన్ని సోనియా గాంధీ ప్రారంభించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పేదలపై అంత ప్రేముంటే ఈ తొమ్మిదిన్నరేళ్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్, గుజరాత్ సహా 18 రాష్ట్రాలకు పెద్దగా లబ్ధి చేకూరదన్నారు. ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ పరిథిలోనే ప్రజలు ఎక్కువ లాభ పడుతున్నారని చెప్పారు. అయినా ఈ పథకానికి అవసరమైన లక్షా 25 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదించిన భూ సేకరణ బిల్లు వల్ల ప్రయోజనం ఎవరికో చెప్పాలని కోరారు.
చెల్లీ.. ఇదిగో ఉల్లి...
బీజేపీ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు వినూత్నంగా జరిగాయి. అక్కా, చెల్లెళ్లు రాకీలు కట్టినప్పుడు అన్నదమ్ములు ఆశీర్వదించి, నోరు తీపి చేయడం ఆనవాయితీ. దీనికి కొంచెం భిన్నంగా ఉల్లిపాయల ధరలతో అక్కచెల్లెళ్లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారనే దాన్ని తెలియజేప్పేందుకన్నట్టుగా వెంకయ్య నాయుడు తనకు రాకీ కట్టిన వారికి తలా రెండు ఉల్లిపాయలు పంచారు. కష్టకాలంలో ఆదుకోవడమే రక్షాబంధన్ ఉద్దేశమైనందున తాను ఉల్లిపాయలు పంచి తన సోదరీమణుల కష్టాలను ఒక్క పూటైనా తీర్చాలనుకున్నానని చమత్కరించారు.