
మా సమస్యలు పరిష్కరించకపోతే... ధాన్యం కొనుగోళ్లు నిలిపేస్తాం
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల సమస్యలు పరిష్కరించని పక్షంలో నవంబరు 15వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తామని, లెవీ కార్యక్రమంలో పాల్గొనబోమని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో జరిగిన అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్ణయించిందని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి తెలిపారు. సంఘం పదాధికారులతో కలిసి బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘‘రూ.30 వేల కోట్ల వార్షిక టర్నోవరుతో రూ. 3 వేల కోట్లకుపైగా పన్ను చెల్లిస్తున్న రైస్ మిల్లింగ్ పరిశ్రమను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.
ధాన్యం సేకరణ, బియ్యం లెవీ పంపిణీ, కస్టమ్డ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్ - ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడం)లో కీలక భూమిక పోషించే రైస్ మిల్లింగ్ పరిశ్రమను అన్ని అంశాల్లో భాగస్వామ్యం చేయాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో కనీసం పరిశ్రమ ప్రతినిధులను సంప్రదించడమే లేదు. రాష్ట్రంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసేది ప్రైవేటు రంగంలోని మా పరిశ్రమే. ఇంతటి ముఖ్యమైన పరిశ్రమ సమస్యలను పట్టించుకోకుండా ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం సాధించాలంటే ఎలా? ప్రభుత్వం చేయాల్సినవి చేయకుండా, సమస్యలు పరిష్కరించకుండా రైస్ మిల్లర్లను విలన్లుగా చూపాలని ప్రయత్నిస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి అయితే మమ్మల్ని సమావేశానికి పిలవడానికే పెద్ద మేలు చేసినట్లు భావిస్తున్నారు..’ అని అసోసియేషన్ ప్రతినిధులు విమర్శించారు.
ఇంత దారుణమా?: ‘‘ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఆడించేందుకు (సీఎంఆర్) మిల్లింగ్ చార్జీలు ప్రభుత్వం పదేళ్ల నుంచి పెంచలేదు. గత నాలుగేళ్లలో విద్యుత్తు చార్జీలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు గతంలో రూ. 75 వేల విద్యుత్తు బిల్లు చెల్లించే మిల్లు ఇప్పుడు రూ.2.5 లక్షలు చెల్లిస్తోంది. మరి ఇంతగా విద్యుత్తు చార్జీలు పెంచిన ప్రభుత్వం సీఎంఆర్ చార్జీలు పెంచకపోవడంకంటే దారుణం ఏముంటుంది?’’ అని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవేందర్‌రెడ్డి, హనుమంతరావు ప్రశ్నించారు.
15 నుంచి నిలిపేస్తాం: ‘‘మా డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో వచ్చేనెల 15వ తేదీ నుంచి ధాన్యం సేకరణ, లెవీ పంపిణీ, సీఎంఆర్ మిల్లింగ్ ప్రక్రియలను పూర్తిగా నిలిపివేస్తాం. ధాన్యం మద్దతు ధరకు అమ్ముకునే విషయంలో రైతులకు ఇబ్బంది కలుగరాదనే ఉద్దేశంతోనే ప్రభుత్వానికి సమస్యల పరిష్కారం కోసం ఈ గడువు ఇస్తున్నాం’’ అని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్‌లో కిలో బియ్యం రూ. 55కు పెరగడానికి మిల్లర్లు కారణం కాదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘‘మిల్లుల్లో ఎక్కడా కిలో బియ్యం రూ. 35 మించి లేదు. ప్రభుత్వం కోరితే ఇదే ధరతో రెండు లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి మేం సిద్ధం’’ అని పేర్కొన్నారు.
మిల్లర్ల డిమాండ్లివీ...
గత పదేళ్లుగా క్వింటాల్ ధాన్యాన్ని ఆడించేందుకుగాను ప్రభుత్వం ముడి బియ్యానికి రూ. 15, ఉప్పుడు బియ్యానికి రూ.25 సీఎంఆర్ చార్జీల కింద చెల్లిస్తోంది. మన రాష్ట్రంలో కంటే విద్యుత్తు చార్జీలు తక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో క్వింటాల్‌కు ముడి బియ్యానికి రూ. 55, ఉప్పుడు బియ్యానికి రూ.85 చెల్లిస్తున్నారు. ఇదే ప్రకారం మన రాష్ట్రంలోని రైస్‌మిల్లులకు కూడా చెల్లించాలి.
2013 -14 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ధాన్యానికి క్వింటాల్‌కు కామన్ గ్రేడ్ రూ. 1,310, గ్రేడ్-‘ఎ’ రూ.1,345 చొప్పున కనీస మద్దతు ధరలు నిర్ణయిం చిన ప్రభుత్వం మిల్లర్ల నుంచి లెవీ బియ్యం సేకరణ ధరను మాత్రం ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఇప్పటికైనా వెంటనే బియ్యం లెవీ సేకరణ ధరను నిర్ణయించాలి.
బీపీటీ లాంటి మేలురకం బియ్యం బయట రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేందుకు సంబంధించి ఆంక్షలను తక్షణ మే తొలగించాలి. ఈ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,500 ప్రోత్సాహక ధర ప్రకటించిన ప్రభుత్వం ఈ బియ్యం అమ్మకం ధరను ప్రకటిస్తే తదనుగుణంగా అమ్ముతాం.