బైక్ ఉంటే.. రేషన్ కట్!
80 వేల బియ్యం యూనిట్లకు కోత
20 శాతం కార్డులకు సరుకులు నిల్
6 నెలలు వరుసగా రేషన్ తీసుకోని వారి పేర్లు తొలగింపుట
ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాక్కుంటున్న సర్కారు
సామాన్య ప్రజల గగ్గోలు
మీకు 100 సీసీ బైకు ఉందా.. 750 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు ఉందా.. 2.5 ఎకరాల మాగాణి ఉందా.. 5 ఎకరాల మెట్ట భూములున్నాయా.. మీ ఇంటికి రూ.500కు పైగా విద్యుత్ బిల్లు వస్తోందా?..
వీటిలో ఏ ఒక్కదానికి మీరు ‘అవును’ అని తలూపినా.. సంక్షేమ కార్యక్రమాలకు మీరు
అనర్హులైనట్లే!
ఇదేమిటి.. ఇదెక్కడి చోద్యం అనకండి.. ఎందుకంటే రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉంటున్నాయి మరి..!! పైన పేర్కొన్న కొలమానాలు పెట్టి సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల సంఖ్యను తెగ్గొట్టి నిధులు మిగుల్చుకోవాలని ప్రభుత్వ పెద్దలు తలపోస్తున్నారు.
చివరికి ఇదే ఫార్ములాతో రేషన్ బియ్యంలోనూ కోత విధించేందుకు సిద్ధపడ్డారు. తర్వాత వంతు సామాజిక పెన్షన్లదని అధికారులే చెబుతున్నారు.
ఇంటిలో ఒకరి పేరే..
మా ఇంటిలో నాభర్త, నేను, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి పేరుతోనే రేషన్‌కార్డులో అచ్చయింది. దీంతో ఐదుకిలోల బియ్యమే ఇస్తున్నారు. ముగ్గురికి రేషన్ ఇవ్వరట. కార్డు సమస్య ఇలా ఉండడం వల్ల సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసినా స్పందన లేదు. - సీహెచ్.సంతోషి, ఇందిరానగర్
విశాఖపట్నం : ప్రస్తుతం జరుగుతున్న రేషన్ బియ్యంలో కోత విధించే తంతు చూస్తే.. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కున్నట్టుంది సర్కార్ తీరు. ఆధార్ సీడింగ్ పేరుతో గత ఏడాది కాలంలో రెండున్నర లక్షలకు పైగా కార్డులను, ఐదులక్షలకు పైగా యూనిట్లను తొలగించిన ప్రభుత్వం.. అనంతరం తీరిగ్గా కొత్త కార్డులు జారీ చేసింది. అందులో భాగంగా విశాఖ జిల్లాలో 1.15 లక్షల కొత్తకార్డులు ఇచ్చారు. ఈ కార్డుల పరిధిలో 1.85 లక్షల బియ్యం యూనిట్లు(కుటుంబంలోని ఒక మనిషికి ఇచ్చే బియ్యాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు) ఉన్నాయి. జనవరిలో నిర్వహించిన ‘జన్మభూమి-మావూరు’లో అట్టహాసంగా పంపిణీ చేసిన ఈ కార్డుల అసలు రంగు ఫిబ్రవరిలో బయటపడింది. రేషన్ కార్డుల్లో నమోదైన ఒకరిద్దరిద్దరు సభ్యులకు మినహా మిగిలిన సభ్యులకు బియ్యం ఇవ్వం పొమ్మన్నారు డీలర్లు. కాగా సుమారు 20 శాతం కార్డులకు అసలు సరుకులే అందలేదు. కారణం అడిగితే ఈ కార్డుల్లో ఏ ఒక్కరికీ సరుకుల ఎలాట్‌మెంట్ జరగలేదని చెబుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆధార్, ఫ్యామిలీ ఫోటోలు అప్‌లోడ్ కానందునే సరుకులు కేటాయించలేదని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ 20 శాతం కొత్తకార్డులతోపాటు మొత్తం కార్డుల్లో సుమారు 80వేల యూనిట్లకు ఫిబ్రవరిలో సరుకులందలేదు. దీంతో వారంతా తమ ఆధార్, ఫ్యామిలీ ఫోటోలు అప్‌లోడ్ చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలు, ఏఎస్‌వో కార్యాలయాల వద్ద క్యూలు కట్టారు. కానీ అక్కడి కంప్యూటర్లు వీరిలో చాలా మందిని తెల్లకార్డుకు అనర్హులుగా ప్రకటిస్తూ.. వారికి సరుకులిచ్చే అవకాశం లేదని తేల్చేశాయి. ఏ విధంగా మేము అనర్హులమో చెప్పాలని కోరితే.. మీకు వందకుపైగా సీసీ సామర్థ్యమున్న బైకు ఉందని కంప్యూటర్ చూపిస్తోంది. ఈ ఒక్క కారణంతోనే సరుకులందని 80 వేల యూనిట్లలో సగానికిైపైగా కంప్యూటర్ వ్యవస్థ తొలగించేసిందని అధికారులే చెబుతున్నారు.
ఇది ఆరంభమే..
ఇక్కడితో అయిపోలేదని.. తర్వాత దశల్లో ఇంకా చాలామంది పేర్లు అనర్హుల జాబితాలో చేరిపోతాయని అంటున్నారు. అదేలా అంటే.. తర్వాతి దశల్లో 750 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు.. 2.5 ఎకరాల మాగాణి.. 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారిని.. రూ.500కు పైగా విద్యుత్ బిల్లులొస్తున్న వారి పేర్లను రేషన్ అర్హుల జాబితా నుంచి తొలగించేలా కంప్యూటర్ వ్యవస్థకు ఫీడ్ చేస్తారని తెలుస్తోంది. మరోపక్క ఈ-పా్‌స్ ద్వారా సరుకులు తీసుకోలేని 21 శాతానికి పైగా రేషన్‌కార్డులను ఈ-పాస్ మిషన్ల నుంచి ఇప్పటికే తొలగించేశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా సరుకులు తీసుకోని వారిని గుర్తించి వారి పేర్లను హైదరాబాద్ స్థాయిలోనే సర్వర్ నుంచి తొలగించేశారు. వీరి కార్డులు రద్దు కావని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ ఈ-పాస్ మిషన్లలో వాటి వివరాలు ఇక కన్పించవు. ఈ విధంగా లక్షన్నరకు పైగా కార్డులు పూర్తిగా ఈ-పాస్ నుంచి తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదంతా హైదరాబాద్ స్థాయిలో జరిగిందని.. తమకు కూడా కనీస సమాచారం లేదంటున్నారు. కాగా ఇచ్చినట్టే ఇచ్చి ఈ కోతలేమిటని కొత్త కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. జనవరిలో కొత్తగా జారీ చేసిన 1.15 లక్షల కార్డుల్లో కనీసం 20 శాతం కార్డుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరో పక్క సరుకులందక ఇబ్బందిపడుతున్న పాత కార్డుల వారి పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది.
అడిగితే నాపేరు తీసేశారు... 18జీపీఎల్15: కాళ్ల రమణమ్మ
మా ఇంటిలోని అందరి పేర్లు రేషన్‌కార్డులో ఉన్నా.. రికార్డులో లేవంటూ డీలరు చెప్పారు. తొలుత ఐదుగురిలో ఇద్దరికే రేషన్ ఇచ్చేవారు. తర్వాత నాపేరు, ఎవరి పేరూ లేదట. ఇదేం విడ్డూరమో తెలీదు. పేదల బాధలు వినడానికి అధికారులకు తీరిక లేదు. కాళ్ల రమణమ్మ, గోపాలపట్నం