వ్యవసాయశాఖకు జిల్లాలోని పలు మండలాల్లో సొంత గూడు కరువైంది. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన వ్యవసాయాధికారులకు....
=22 మండలాల్లో వ్యవసాయశాఖకు పక్కాభవనాల్లేవు
=అసిస్టెంట్ డెరైక్టర్లదీ అదే పరిస్థితి
=అద్దె కొంపల్లో అవస్థలు పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం : వ్యవసాయశాఖకు జిల్లాలోని పలు మండలాల్లో సొంత గూడు కరువైంది. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన వ్యవసాయాధికారులకు వసతి లేక అక్కడో ఇక్కడో అన్నట్టు కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఏ సమయంలో ఎక్కడుంటారో తెలియని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులపై నిర్లక్ష్యం చూపినట్టే వ్యవసాయాధికారులపైనా శీతకన్ను వేసింది. జిల్లాలోని 22 మండలాల్లో వ్యవసాయశాఖకు సొంత కార్యాలయాల్లేవు.
మండలపరిషత్, ఇతరత్రా కార్యాలయాల్లో ఆయా అధికారుల దయాదాక్షిణ్యాలపై ఏవోలు నెట్టుకొస్తున్నారు. మరికొందరు అద్దె భవనాల్లో కొనసాగుతున్నారు. జిల్లాలో 10 మంది అసిస్టెంట్ డెరైక్టర్లు(ఏడీఏ)దీ ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయకపోవడంతో సకాలంలో అద్దె చెల్లించలేక కొందరు అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి గ్రామీణ జిల్లాలో 75 శాతం మంది వ్యవసాయం ఆధారంగా బతుకుతున్నారు.
ఈమేరకు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అధికారులు అందుబాటులో ఉండాలి. కానీ సరైన వసతి లేక ఎప్పుడెక్కడ ఉంటారో తెలియడం లేదు. మండల వ్యవసాయాధికారులు, అసిస్టెంట్ డెరైక్టర్లకు సొంత భవనాలను సమకూర్చడానికి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు పంపారు. కానీ సర్కార్ స్పందించలేదు. ఇటీవల గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజుతో జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయాధికారులు ఈ సమస్యను ప్రస్తావించారు. దీంతో మరోసారి ప్రతిపాదనలు పంపాలని మంత్రి కోరారు. ఈసారైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.