
మార్చి15 వరకే కరెంటు!
- కరువు పరిస్థితుల్లో రైతన్న నెత్తిన మరో పిడుగు
- ఆ తర్వాత పంటలకు విద్యుత్ సరఫరా
- చేయలేమంటున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ‘కరెంటు సమస్య తరుముకొస్తోంది. వచ్చే వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. అందువల్ల రబీలో వేసే పంటలన్నీ మార్చి 15వ తేదీలోగా చేతికొచ్చేలా ఉండాలి. అలాంటి స్వల్పకాలిక పంటలనే రైతులతో వేయించాలి. మార్చి 15 తర్వాత పంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు సరఫరా చేసే పరిస్థితి లేదు. ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పించండి..’.. జిల్లా అధికారులకు వ్యవసాయశాఖ జారీ చేసిన ఆదేశాల సారాంశమిది.
మార్చి తర్వాత గృహ విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని, పరిశ్రమలకూ విద్యుత్ అందించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. సాధారణంగా మే నెల వరకూ రబీ పంటలు కొనసాగుతాయి. కానీ నెలన్నర ముందుగానే రబీ పంటలను పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఆదేశించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రబీ సీజన్‌ను ఎలా ముందుకు తీసుకురాగలమని కొందరు అధికారులు సందేహం వెలిబుచ్చుతున్నారు.
ఆలస్యమైన రబీ సాగు..
రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో ఖరీఫ్ సీజన్ ఆలస్యమైంది. సెప్టెంబర్ 30 నాటికే పూర్తికావాల్సిన ఆ సీజన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఖరీఫ్ పంట కోతలు సాగుతున్నాయి. ఫలితంగా రబీ పంటల సాగు ఆలస్యమైంది. రబీ సీజన్ మొదలై రెండు నెలలు దాటినా ఇప్పటివరకు 62 శాతం కూడా పంటల సాగు జరగలేదు. సాధారణంగా రబీలో మొత్తంగా 13.09 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా.. ప్రస్తుత సమయానికి 4.89 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. కానీ 3.04 లక్షల హెక్టార్లలోనే (62%) సాగు ప్రారంభమైంది.
మొత్తం సీజన్‌తో పోలిస్తే ఇది కేవలం 23 శాతమే కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి 15 నాటికి చేతికి వచ్చేలా రబీ పంటలు సాగు చేయాలని, అప్పటి వరకు మాత్రమే కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వ్యవసాయ శాఖ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వరి, చెరకు వంటి దీర్ఘకాలిక పంటల సాగు చేపట్టవద్దని కోరుతోంది.
మార్చి15 నాటికి పూర్తయ్యే జొన్న, సజ్జ, పెసర, ఆముదం, శనగ వంటి మూడు నెలలు లేదా 100 రోజుల్లో పూర్తయ్యే ఆరు తడి పంటల వైపే మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేస్తోంది. దీర్ఘకాలిక పం టలు వేస్తే ఇబ్బందులు తప్పవని, వాటికి కరెంటు సరఫరా చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.
కమ్ముకున్న కరువు మేఘాలు
మరోవైపు కరువు పరిస్థితులు రాష్ట్రాన్ని కమ్మేశాయి. రబీలో వర్షపాతం లోటు ఏకంగా 60 శాతంగా ఉండటం ఆందోళనకరం. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లను కలిపి విశ్లేషిస్తే రాష్ట్రంలోని 345 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 73 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో పంటల దిగుబడి దాదాపు 40 శాతం తగ్గవచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ కరువు పరిస్థితిపై ప్రభుత్వం అధ్యయన కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ పంట కోత ప్రయోగాల నివేదిక వచ్చాక కరువు మండలాలను ప్రకటించే అవకాశముంది. ఇలా ఒకవైపు కరువు, మరోవైపు భూగర్భ జలాలు పడిపోవడం, మార్చి 15 తర్వాత కరెంటు ఇచ్చే అవకాశం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో... రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.