ఆ హోటల్‌కు అక్రమాలే పునాది | Illegal Constructions in Visakhapatnam Beach Road | Sakshi
Sakshi News home page

ఆ హోటల్‌కు అక్రమాలే పునాది

Published Tue, Jan 22 2019 8:28 AM | Last Updated on Tue, Jan 22 2019 8:28 AM

Illegal Constructions in Visakhapatnam Beach Road - Sakshi

హోటల్‌ ముందున్న డివైడర్‌ను తవ్వేసి అమర్చిన గేటు

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం.. పత్రికల్లో వార్తలు వచ్చినా, అధికారుల చర్యలు చేపట్టినా.. కొద్దిరోజులు పనులు ఆపేసినట్లు నటించి.. దృష్టి మళ్లించడం.. అందరూ దాన్ని మర్చిపోగానే మళ్లీ అక్రమ నిర్మాణాలు కొనసాగించడం సాధారణ తంతుగా మారిపోయింది..బీచ్‌రోడ్డులో సాగర్‌నగర్‌ సమీపంలో ప్రస్తుతం చకచకా సాగుతున్న ఒక హోటల్‌ నిర్మాణమే దీనికి నిదర్శనం. సముద్రతీరానికి సమీపంలో కొన్ని మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సీఆర్‌జెడ్‌ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దానికి విరుద్ధంగా సాగరతీరాన్ని ఆనుకొనే హోటల్‌ నిర్మాణానికి ఎలా అనుమతించారో.. లేక అనుమతి తెచ్చుకున్నామని నిర్వాహకులు మభ్యపెడుతున్నారో తెలియదుగానీ.. రెండేళ్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ తంతు జరుగుతోంది. అధికారులు హెచ్చరించినప్పుడు కొద్దిరోజులు నిర్మాణం నిలిపివేయడం.. మళ్లీ ప్రారంభించడం.. ఇదీ వరస.. అలా మొత్తానికి నిర్మాణాన్ని దాదా పు పూర్తి చేసేశారు. దీనికోసం ప్రభుత్వం నిర్మించిన ఫుట్‌పాత్‌ను, డివైడర్లను ఇష్టారాజ్యంగా తొలిగించేసినా పట్టించుకునేవారు లేరు. అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాల న్న ధ్యాస కూడా అధికారులకు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆరిలోవ(విశాఖ తూర్పు): సామాన్యుడు కష్టపడి చిన్న ఇల్లు నిర్మించుకుంటే.. మెట్లు కాలువ మీదకు వచ్చేశాయని.. శ్లాబ్‌ రోడ్డువైపు బయటకు వచ్చేసిందని హడావుడి చేసి.. కూల్చేసే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సముద్రుడి సాక్షిగా.. తామే ఇచ్చిన నోటీసులను సైతం ఖాతరు చేయకుండా కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌(సీఆర్‌జెడ్‌) నిబంధనలకుపాతరేస్తున్న బడా నిర్మాణదారుల పట్ల మాత్రం ఉపేక్ష వహిస్తున్నారు. ఫలితంగా సాగర్‌నగర్‌ వద్ద సముద్ర తీరానికి దాదాపు ఆనుకొని ఓ హోటల్‌ నిర్మాణం దర్జాగా సాగిపోతోంది. జీవీఎంసీ, రెవె న్యూ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా.. ఇప్పుడు  కళ్లు మూసుకున్నారు. జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు దీనివైపు కన్నెత్తి చూడటం లేదు. జోడుగుళ్లుపాలెం నుంచి రుషికొండ వరకు బీచ్‌రోడ్డు ఆనుకొని సీఆర్‌జెడ్‌ నిబంధనలు వర్తిస్తాయి. ఈ రోడ్డు నుంచి సముద్రం వైపు ఎలాంటి కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టకూడదు.

పూర్తికావచ్చిన నిర్మాణాలు
ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ హోటల్‌ నిర్మాణం పక్కాగా జరిగిపోతోంది. ఇందులో శ్లాబుతో రెండు గదులు నిర్మించారు. పలుచోట్ల కాంక్రీట్‌ ఫ్లోర్లు వేశారు. సిమెంట్‌ పలకలు అమర్చి హోటల్‌ లోపలికి మార్గాలు కూడా నిర్మించేశారు. సాగరతీరంలో చెక్కలతో తాత్కాలిక దాబాల నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ అనుమతి ఇస్తోంది. బీచ్‌రోడ్డులో అటువంటి కొన్ని ఉన్నాయి. ఈ హోటల్‌ కూడా గతంలో అదేమాదిరిగా కంటెయినర్‌ హోటల్‌గా ఏర్పాటు చేశారు. చెక్కలు, రేకులతో గది మాదిరిగా ఏర్పాటుచేసి నిర్వహించారు. ప్రస్తుతం దాన్ని విస్తరించి నిబంధనలకు సమాధి కట్టారు. ఆ పునాదులపైనే పక్కా కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టారు.

రెండేళ్ల క్రితం నుంచే..
రెండేళ్ల కిందటే నుంచే ఈ హోటల్‌ విస్తరణకు నిర్వాహకులు సన్నాహాలు చేపట్టారు. అప్పటి రూరల్‌ తహసీల్దారు లాలం సుధాకర్‌నాయుడు అటవీశాఖ, రెవెన్యూ స్థలంలో నిర్మాణం చేపట్టకూడదంటూ పనులు నిలిపేశారు. దాంతో కొన్నాళ్లు నిలిపేసిన పనులను కొద్ది రోజుల క్రితం మళ్లీ ప్రారంభించి చకచకా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఒకటో జోన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు హెచ్చరించగా.. రెండు రోజుల పాటు పనులు నిలిపేసి మళ్లీ కొనసాగిస్తున్నారు. ఈసారి మాత్రం అధికారులు అటువైపు చూడటంలేదు.

అంతా ఇష్టారాజ్యమే..
బీచ్‌ రోడ్డు పక్కన పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌ను కూడా హోటల్‌ యజమానులు వదల్లేదు. హోటల్‌ ముందు అడుగు ఎత్తులో ఉన్న ఫుట్‌పాత్‌ను రెండుచోట్ల తవ్వేశారు. హోటల్‌కు కస్టమర్లు రావడానికి మార్గం కోసం ఓ చోట, వాహనాల పార్కింగ్‌ కోసం మరోచోట తొలగించేశారు. అంతే కాకుండా బీచ్‌రోడ్డు రెండు లైన్ల మధ్య ఉన్న డివైడర్‌ను సైతం తొలగించేశారు. పూలమొక్కలు నాటిన డివైడర్‌ను తొలగించి ఇనుప గేటు ఏర్పాటు చేశారు. నగరం నుంచి వచ్చేవారు దీనికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు పార్క్‌ చేసి.. రోడ్డుదాటి రావడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఎక్కడపడితే అక్కడ పాదచారులు క్రాస్‌ చేయకూడదు. దాన్ని ఉల్లంఘిస్తున్న ట్రాపిక్‌ పోలీసులు దీనిపై దృష్టిపెట్టడం లేదు.

నోటీసులు ఇచ్చాం
సీఆర్‌జెడ్‌ నిబంధనల ప్రకారం ఇక్కడ నిర్మాణం చేపట్టకూడదు. దాన్ని ఉల్లంఘించి నిర్మాణం చేపట్టిన నిర్వాహకులకు ఇటీవలే నోటీసులు ఇచ్చాం. దాంతో కొన్నాళ్లు పనులు నిలిపేశారు. ఆ హోటల్‌ నిర్వాహకులు వీఎంఆర్‌డీఏ అధికారుల నుంచి హోటల్‌ నిర్మాణానికి అనుమతి తెచ్చుకొన్నట్లుంది. ఫుట్‌పాత్, డివైడర్లు తవ్వేసిన అంశంపై వీఎంఆర్‌డీఏ అధికారులే స్పందించాలి.   – వెంకటేశ్వరరావు, ఏసీపీ,ఒకటో జోన్, జీవీఎంసీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement