మాయమవుతున్న మాంగనీస్‌ | Illegal Mining In Vizianagaram District | Sakshi
Sakshi News home page

మాయమవుతున్న మాంగనీస్‌

Published Tue, Aug 27 2019 9:41 AM | Last Updated on Tue, Aug 27 2019 9:44 AM

Illegal Mining In Vizianagaram District - Sakshi

ఎస్‌కే సర్వాగీ అండ్‌కో ప్రైవేట్‌ లిమిటెడ్‌ మైనింగ్‌ ప్రాంతం

జిల్లాలోని నాణ్యమైన మాంగనీసు మాయమవుతోంది. అనుమతుల్లే కుండానే ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. అక్రమార్కుల జేబుల్లోకి  నగదురూపంలో చేరిపోతోంది. ఇటీవల అనుమతుల్లేకుండా తరలిస్తున్న నాలుగు లారీల మాంగనీసు పట్టుబడడంతో గనుల అక్రమతవ్వకం  బహిర్గతమైంది. మంగనీసు కొండలు తరుగుతున్నా అధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒకచోట తవ్వకానికి అనుమతి తీసుకొని మరోచోట అనధికారికంగా, అధికంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇటీవల దొంగ పర్మిట్‌లతో రవాణా చేస్తున్న 120 టన్నుల మాంగనీస్‌ పట్టుబడింది. నాలుగు లారీల్లో తరలిస్తున్న మాంగనీస్‌ ఖనిజం ఎక్కడ నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది. జిల్లాలో ఇదే విధంగా మరికొన్ని చోట్ల కూడా గనుల అక్రమ రవాణా, తవ్వకాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరందుకోంది.

నిల్వల్లో ప్రథమం..     
రాష్ట్రంలో ఎక్కడా లేని నాణ్యమైన మాంగనీసు విజయనగరం కొండల్లో 14 మిలియన్‌ టన్నులు ఉంది. 40 వేల ఏళ్ల కిందట ఏర్పడిన మాంగనీస్‌ భూ ఉపరితలానికి 22 మీటర్ల లోతులో ఇక్కడ లభిస్తోంది. దీంతో విజయనగరం మాంగనీసు గనులకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలోని గరివిడి, మెరకముడిదాం, చీపురుపల్లి, పూసపాటి రేగ, సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి మండలాలతో పాటు జిల్లాలోని పార్వతీపురంలో కూడా మాంగనీస్‌ గనులున్నాయి. ఈ గనుల నుంచి ఏటా సుమారు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంగనీస్‌ నిల్వలను తరలిస్తున్నట్టు అంచనా. అయితే, అధికారులు మాత్రం లక్షా 50వేల టన్నులు మాత్రమే వెళ్తోందని లెక్కగడుతున్నారు. అంటే ఒకే పర్మిట్‌తో  రెండు మూడు లారీలు వెళ్తుండడంతో పాటు తనిఖీలు జరుగకుండా వెళ్తున్నవి అధికంగా ఉంటున్నాయి.

లైసెన్స్‌లు రద్దుచేసినా ఆగని తవ్వకాలు.. 
బొబ్బిలి మండలం మెట్టవలస పంచాయతీ బోడిమెట్ట కొండ 182 సర్వే నంబర్‌లో గతంలో ఏడుగురికి లైసెన్సులుండేవి. పరిశ్రమలు ఉన్న గ్రోత్‌ సెంటర్‌ను ఆనుకునే బోడి మెట్టకొండ ఉంది. ఇక్కడ 34.37 ఎకరాలు (13.915హెక్టార్లు) విస్తీర్ణంలో సంవత్సరానికి రూ.50వేల చొప్పున లైసెన్సులను ఏడుగురు వ్యక్తులకు ఉండేవి. అయితే, ఇందులో  లైసెన్సుదారులు వారికి కేటాయించిన  పరిధి దాటి తవ్వకాలు చేపట్టడం, నిబంధనలు అతిక్రమించడంతో సుమారు ఐదుగురి లైసెన్సులు రద్దుచేశారు. అయినప్పటికీ వారు ఇంకా అదే ప్రదేశంలో అక్రమ తవ్వకాలు చేపడుతుండడం గమనార్హం. 

చీపురుపల్లి నియోజకవర్గంలో మాంగనీస్‌  గనులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా జరుగుతుంటుంది. అయితే, ఇటీవల అక్కడి పెద్దపెద్ద మైనింగ్‌ కంపెనీలు మై నింగ్‌ను నిలిపివేశాయి. దీంతో మైనింగ్‌ ఎక్కడా జరగడం లేదనే అంతా అనుకున్నారు. కానీ అనూహ్యం గా ఈ నెల 23న ఎస్‌కే సర్వాగీ అండ్‌కో ప్రైవేట్‌ లిమి టెడ్‌ పేరుతో రూ.12 లక్షల విలువైన 240 టన్నుల మాంగనీస్‌ను ఆరు లారీల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిజానికి చీపురుపల్లి మండలంలో సర్వాగి మైనింగ్‌ను మూసేశారు. అక్కడ తవ్వకాలు జరగడం లేదు. మరలాంటప్పుడు ఆ కంపెనీ పేరుతో ఆరు లారీల మాంగనీస్‌ ఎక్కడి నుంచి తవ్వి తీసుకువస్తున్నారనేది మిస్టరీగా మారింది.

 విజిలెన్స్‌ కేసులుంటే బంధువులకు లైసెన్సులు.. 
గనుల అక్రమ తవ్వకాలపై అధికారులు అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. గతంలో బోడిమెట్ట కొండ ప్రాంతంలో ఉన్న లైసెన్సుదారులు అధికంగా తవ్వకాలు, పరిధిని మించి క్వారీ మెటల్‌ సేకరణ చేస్తుండడంతో మైనింగ్‌ విజిలెన్స్‌ విభాగం దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసింది. కొంత మెటల్‌ను సీజ్‌ చేసింది. లైసెన్సులను రద్దు చేసింది. అదే లైసెన్స్‌దారులు వారి బంధువుల పేరున మళ్లీ లైసెన్సులు తెప్పించుకుని మళ్లీ క్వారీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

లైసెన్సులు..సబ్‌ లైసెన్సులు: 
లైసెన్స్‌ తీసుకున్న గనుల నిర్వహకులు తవ్వకాలకు సబ్‌ లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. గనులుండే కొండప్రాంతాన్ని భాగాలుగా చేసి సబ్‌ లైసెన్సులకు ఇస్తున్నారు. నెలకు కొంత మొత్తాన్ని లైసెన్సు దారులకు  ముట్టజెప్పేందుకు ఒప్పందాలు చేసుకుని గుట్టుగా వ్యాపారం చేస్తున్నారు. వీరి విషయం అధికారులకు తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గడిచిన గనుల ప్రమాదాల్లో అమాయక కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

398, 447 చట్టాలకు తూట్లు :
క్వారీలు, చెరువులు, ఇసుక రేవుల్లోని వనరులను విక్రయించుకుంటూ వ్యాపారం చేసుకునే వారు మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ చట్టాలను బేఖాతరు చేస్తూ  ఇసుక అక్రమ తవ్వకాలు, నిల్వల దందా సాగుతూనే ఉంది. అధికారులు «గుర్తించిన ఇసుక రిచ్‌లను మాత్రమే వినియోగించక పోవడం, అధికారికంగా నిర్ణయించిన ధరలను అమలు పరచకపోవడం, అక్రమ రవాణాపై ఉన్న నిబంధనలు, ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. సాధారణంగా ఇసుక, గ్రావెల్‌ వంటివి అవసరమైన వారు మైన్స్‌ అండ్‌ మినరల్స్‌లోని యాక్ట్‌ 379, 447 ప్రకారం మండల తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్‌ఐలతో కూడిన  అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఎవరూ పాటించడం లేదు.

చర్యలు తీసుకుంటాం:
లైసెన్సులు ఉన్నవారే గనుల తవ్వకాలు జరపాలి. పరిధి దాటి జరుపకూడదు. బొబ్బిలి లోని మెట్టవలస క్వారీల్లో లైసెన్సులున్న వారు తవ్వకాలు జరపలేదని ఇటీవల చేపట్టిన పరిశీలన అనంతరం మా సిబ్బంది తెలిపారు. ఓ సారి పరిశీలిస్తాం. చీపురుపల్లిలో పట్టుబడిన మాంగనీస్‌ ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై విచారణ జరుపుతున్నాం. 
– డాక్టర్‌ ఎస్వీ రమణారావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ, విజయనగరం 

నిబంధనలు ఉల్లంఘించిన ‘సర్వాగీ’
చీపురుపల్లి: ఎస్‌.కె.సర్వాగీ మైనింగ్‌ పరి శ్రమ నిబంధనలు ఉల్లంఘించింది. అనుమతులు లేకుండా మాంగనీస్‌ తవ్వకాలు జరిపి వేరే ప్రాంతాలకు చెందిన పర్మిట్లతో అక్రమ రవాణాకు పాల్పడింది. ఇది కచ్ఛితంగా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని జిల్లా భూగర్భ గనులశాఖ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పురుషోత్తమనాయుడు అన్నారు. మండలంలోని పెదనడిపల్లి రెవెన్యూ పరిధిలో ఎస్‌.కె.సర్వాగీ మైనింగ్‌ తవ్వకాలను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ నెల 23న రాత్రి చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి మైనిం గ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు మాంగనీసు లారీలను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ లారీల సమాచారాన్ని ఈ నెల 24న జిల్లా భూగర్భ గనులశాఖకు చేరవేశారు. దీంతో రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పురుషోత్తమనాయుడు సర్వాగీ పరిశ్రమలో మైనింగ్‌ తవ్వకాలు, అనుమతులు, హద్దులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పట్టుబడిన ఆరు మాంగనీసు లోడు లారీల్లో రెండింటికే అనుమతులు ఉన్నాయన్నారు. మిగిలిన నాలుగు లోడ్‌లను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మెరకముడిదాం మండలంలోని కొత్తకర్ర మైనింగ్‌ పర్మిట్లు చూపించి, చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి, ఇటకర్లపల్లి మైనింగ్‌లు నుంచి నాలుగు లారీల్లో మాంగనీరు తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. చీపురుపల్లి మండలంలో సర్వాగీ పరిశ్రమకు చెందిన మైనింగ్‌లలో తవ్వకాలు జరగడం లేదని, అయినప్పటికీ మెరకముడిదాం మండలంలోని కొత్తకర్ర మైనింగ్‌ పర్మిట్లు పెట్టి మాంగనీసు రవాణా చేయడం నేరమన్నారు. దీనికి జిల్లా అధికారులు అపరాధ రుసుము విధిస్తారని తెలిపారు. పూర్తి స్థాయి నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement