కాసుల వేట | illegal sand mafia in nizamabad | Sakshi
Sakshi News home page

కాసుల వేట

Published Fri, Dec 13 2013 2:07 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

illegal sand mafia in nizamabad


 ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు’ అన్నది పద్యం...‘తివిరి ఇసుమున పైకంబు తీయవచ్చు’ అన్నది నేటి వ్యాపారుల సూత్రం. జిల్లాలో ఇసుక వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న ఇసుక మాఫియా అదను చూసి జడలు విప్పుతోంది. అడ్డగోలుగా వచ్చే ఆదాయానికి రుచిమరిగిన ఇసుకాసురులు ‘అధికార’ అండదండలతో భూగర్భానికి గుంతలు చేస్తూ   ఇసుకను కొల్లగొడుతున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం గురించి   తెలిసినప్పటికీ రెవెన్యూ, గనుల శాఖలు గుడ్లప్పగించి చూస్తున్నాయే తప్ప పట్టించుకున్న పాపాన పోవటం లేదు.
 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
 జిల్లాకు చెందిన దళారులే కాకుండా పక్క ప్రాంతాలకు చెందిన మాఫియా ఇసుక వ్యాపారంలో నిమగ్నమై కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లాలో 20కిపైగా కేంద్రాల నుంచి ఇసుక దందా సాగుతోం ది. బోధన్, బాన్సువాడ, జుక్కల్, బా ల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. బాన్సువాడ, పిట్లం, బీర్కూర్, బిచ్కుంద, కోటగిరి మండలాల పరిధిలోని మంజీరా నది సమీప ప్రాంతా ల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా  జరుగుతోంది. ఈ ప్రాంతాల నుంచే 10 కేంద్రాల ద్వారా రోజుకు 150 నుంచి 200 టిప్పర్ల ఇసుకను ఇతర ప్రాం తాలకు తరలిస్తున్నారు. టిప్పర్ ఇసుక ఇక్కడ రూ. 6500 నుంచి రూ.7 వేలకు లభిస్తుండగా, ఇతర ప్రాంతాలలో ధర రూ. 10వేలకు పైగా పలుకుతోంది. బోధన్, రెంజల్ మండలాల పరిధిలోనూ ఇసుక దందా అధికంగా ఉంది.
 
 ‘మహా’ వ్యాపారులు
 మహారాష్ట్ర వ్యాపారులు మన ప్రాంతంలోకి చొరబడి ఈ దందాను యథేచ్చగా సాగిస్తున్నారు. భీంగల్, జక్రాన్‌పల్లి, వేల్పూరు, మోర్తాడ్, కమ్మర్‌పల్లి ప్రాంతాలలోని పెద్ద వాగు నుంచి కూడా ఇసుకను తరలిస్తున్నారు. ఈ మండలాల పరిధిలో  ని పెద్దవాగు సమీప  గ్రామాల నుంచి రోజూ 75 నుంచి 150 టిప్పర్ల ఇసుక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆర్మూ ర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ దందాతో ఇందిరమ్మ ఇళ్లతో పాటు, కొత్త నిర్మాణా లు చేపడుతున్న గృహ యజ  మా నులు, నిర్మాణ సంస్థలు అధిక ధరతో ఇసుకను ఖరీదు చేయలేక తీవ్ర ఇబ్బం      దులు ఎదుర్కొంటున్నారు. ఈ దందాతో  బోధన్, బాన్సువాడ, జుక్కల్ , ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలో భూగర్భ జలా   లు అడుగంటి పోతున్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రైతులు పంటసాగులో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తోంది. జిల్లా కలెక్టర్ ముఖ్యంగా రెవెన్యూ, మైనింగ్ అధికారులు దృష్టిసారించి ఇసుక అక్రమ వ్యాపారాన్ని అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
 
 జోరుగా డంపింగ్
 వినాయక్‌నగర్ : నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న వసంత్‌నగర్, ఆర్మూర్ రోడ్డులోని గంగస్థాన్ ఫేస్-2లో రోడ్డు పక్కనే ఇసుకను డంప్ చేశారు. ఈ ఇసుకను జన్నేపల్లి వాగులో నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ఇసుక వ్యాపారం కొనసాగిస్తున్నారు. గతంలో అధికారులు అక్రమ ఇసుక మాఫియాను అరికట్టేందుకు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అపుడు ఇసుక రవాణా తగ్గింది. దసరా, దీపావ   ళి తరువాత నూతన గృహాల నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతాయి. దీంతో ఇసుక అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. మూడు టిప్పర్లు ఆరు ట్రాక్టర్లు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. నగర శివారులో రోడ్డు పక్కనే వందల కొద్దీ లారీల ఇసుకను డంపు చేసి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement