
సాక్షి, హైదరాబాద్/విజయవాడ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై పోలీసు దౌరన్యాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాజాపై దాడి చేసిన ఎస్‌ఐపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన తూర్పు గోదావరి ఎస్పీ విశాల్ గున్నిని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎస్పీతో పాటు డీజీపీ సాంబశివరావుతో ఫోన్‌లో మాట్లాడారు. రాజాపై జరిగిన దాడి వ్యవహారం తన దృష్టికి వచ్చిందని ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తనకు చెప్పారని విజయసాయిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీజీపీ దృష్టికి తాను ఈ విషయం తీసుకెళ్లినపుడు, ఎస్‌ఐపై తక్షణం చర్యలు తీసుకుం టానని తనకు హామీ ఇచ్చారని విజయసాయిరెడ్డి వివరించారు.
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రపురం ఎస్‌ఐ నాగరాజును క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సామినేని ఉదయభాను, అధికారప్రతిని«ధులు వెలంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ తదితరులు విలేకరులతో మాట్లాడారు.