
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మందగమన పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోనూ స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు తగ్గాయి. భూములు, స్థలాలు, భవనాల క్రయ విక్రయాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. 2018– 19 ప్రథమార్థంతో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో రిజిస్ట్రేషన్లు 4.21 శాతం తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత/ తిరోగమన రేటు కనిపిస్తోంది. షేర్ మార్కెట్‌లో రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన షేర్లు కనిష్ట స్థాయికి పడిపోయాయి. స్థిరాస్తి రంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయనేందుకు రియల్ ఎస్టేట్ షేర్లు కనిష్ట స్థాయికి పడిపోవడమే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.
తొలి ప్రభావం రియల్ ఎస్టేట్‌పైనే..
‘నల్లధనం ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో చలామణిలో ఉంటుంది. అందువల్ల ఆర్థిక ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే మొదట ఈ రంగంపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆర్థిక రంగం బాగుంటే వాహన విక్రయాలు పెరుగుతాయి. ఇప్పుడు వాహన విక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి’ అని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
2.86 శాతం ఆదాయ వృద్ధి
రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయ ఆర్జన లక్ష్యం రూ.3,234 కోట్లు కాగా రూ. 2,467.67 కోట్లు (76.30 శాతం) మాత్రమే సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన రూ. 2,399.09 కోట్ల ఆదాయంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయంలో వృద్ధి 2.86 శాతంగా నమోదైంది. ఆదాయ ఆర్జనలో గుంటూరు (రూ.347.94 కోట్లు), విశాఖ (రూ.344.91 కోట్లు), కృష్ణా (రూ.330.09 కోట్లు) జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. ఆదాయ వృద్ధిలో విజయనగరం (29.19 శాతం) చిత్తూరు (10.68) వైఎస్సార్ (10.44 శాతం)తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాదితో పోల్చితే గుంటూరు జిల్లాలో ఆదాయం 2.99 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 1.89 శాతం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1.48 శాతం చొప్పున తగ్గింది.
వైఎస్సార్ జిల్లాలో 10 శాతం పెరుగుదల
వైఎస్సార్ జిల్లాలో మాత్రం గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పది శాతానికి పైగా పెరిగింది. ప్రకాశం జిల్లాలో 1.72 శాతం, విజయనగరం జిల్లాలో 1.04 శాతం పెరిగాయి. కర్నూలు జిల్లాలో గత ఏడాది మొదటి ఆరు నెలల్లో నమోదైనన్ని డాక్యుమెంట్లే ఈ ఏడాది కూడా నమోదు కావడం గమనార్హం. రిజిస్ట్రేషన్ల సంఖ్య పరంగా చూస్తే గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.
అధిక ధరలున్న చోట్ల భారీగా తగ్గిన కొనుగోళ్లు
భూములు, స్థలాలు, భవనాల ధరలు అమాంతం పెరిగిన ప్రాంతాల్లో స్థిరాస్తుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ధరలు ఎక్కువగా ఉన్న చోట లావాదేవీలు తగ్గిపోయాయి. గుంటూరు జిల్లాలో రాజధాని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థిరాస్తుల ధరలు భారీగా పెంచేశారు. గత పాలకులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. కృత్రిమ బూమ్ సృష్టించి ధరలు అమాంతం పెంచేశారు. దీంతో గత ఏడాది కూడా అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే గుంటూరు జిల్లాలో స్థిరాస్తి విక్రయ లావాదేవీలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోల్చితే ఈసారి ఇదే కాలంలో గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్లు సుమారు 16 శాతం, కృష్ణా జిల్లాలో 8 శాతం, విశాఖపట్నం జిల్లాలో 4 శాతం పడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment