గుత్తి రూరల్/పామిడి, న్యూస్‌లైన్ : ఉత్తరాఖండ్ వరద బీభత్సం నుంచి బయటపడిన లోకో పైలట్, మజ్దూర్ యూనియన్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ సుబ్బరాయుడు(56), సావిత్రి (50) దంపతులు అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాల్లోకెళితే.. గుత్తి ఆర్‌ఎస్‌లో నివాసముంటున్న వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. చిన్న కుమారుడు బెంగళూరులో, పెద్ద కుమారుడు ఫిన్లాండ్‌లో పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు సుబ్బరామయ్య సెలవులపై కొద్ది రోజుల క్రితం గుత్తి ఆర్‌ఎస్‌కు వచ్చాడు. సెలవులు ముగియడంతో విదేశానికి పయనమయ్యాడు. మూడు రోజుల క్రితం సుబ్బరామయ్యతో కలిసి తల్లిదండ్రులు కూడా బెంగళూరులో ఉంటున్న చిన్నకుమారుడి వద్దకు వెళ్లారు. సోమవారం రాత్రి పెద్దకుమారుడిని ఫిన్లాండ్ ఫ్లైట్ ఎక్కించారు.
అనంతరం సుబ్బరాయుడు, సావిత్రి ‘జైలో’ వాహనంలో తిరుగుపయనమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున పామిడి మండలం గజరాంపల్లి వద్దకు రాగానే నిలిచివున్న వర్షపు నీరు అద్దాలపై పడటంతో డ్రైవర్ అదుపు తప్పి డివైడర్‌ను ఎక్కించి, అవతలి రోడ్డులో వస్తున్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సుబ్బరాయుడు, సావిత్రి అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
జైలో వాహనం డ్రైవర్ గుత్తికి చెందిన శ్యామ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సుబ్బరాయుడు దంపతుల మృతికి మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు సంతాపం తెలిపారు. కాగా సుబ్బరాయుడు దంపతులు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని.. ప్రణాలతో బయటపడి.. ఇప్పుడిలా తనువు చాలించడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
మృత్యువులోనూ తోడుగా...
Published Wed, Sep 11 2013 4:27 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement