గుంతకల్లు రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలోని గుంతకల్లు, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గుంతకల్లు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది.
దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షపు నీటితో పాత బస్టాండ్ రోడ్డు చెరువును తలపించింది. బీఎస్‌ఎస్ కాలనీ, పాతగుత్తి రోడ్డులోని అరక్షిత శిశు మందిరం ప్రాంతం, పాత ఫైర్‌స్టేషన్ ఏరియా, తిమ్మనచర్ల ప్రాంతం, కసాపురం రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా నీరు పారడటంతోఈ ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
శివారు ప్రాంతాలైన సీఐటీయూ కాలనీ, రామిరెడ్డి కాలనీ, ఆంకాళమ్మగుడి, అంబేద్కర్‌నగర్ సమీపంలోని శ్రీలంక కాలనీలు నీటిమయమయ్యాయి. ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద ఉన్న రామసుబ్బయ్య జిన్నా ప్రాంతంలోని గుడిసెల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఇళ్లలోని సామాగ్రి, బియ్యం, దుస్తులు తడిసిపోయాయని బాధితులు వాపోయారు. మండీబజార్‌లోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద పెద్ద చెట్టు నేలకూలింది. దీంతో అంజుమన్‌వీధిలోని మూడు విద్యుత్ స్తంభాలు కూలిపోయి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
గుంతకల్లులో భారీ వర్షం
Published Wed, Oct 16 2013 2:37 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement