
బాబుపై ప్రజలు తిరగబడడం ఖాయం
పశుపోషణ శిబిరాలు ఏర్పాటు చేసి
పాడి రైతులను ఆదుకోండి
మదనపల్లె: సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రజలు ఆరు నెలల్లో తిరగబడడం ఖాయమని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో శుష్క వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి బాబు ప్రజలను తీవ్రంగా మోసం చేశారన్నారు. రుణమాఫీకి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించకపోవడంతో ఇక అది అసాధ్యమని తేలిపోయిందని తెలిపారు.
ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అయిందని, మరో నాలుగు నెలలు చూసి ప్రజలు తిరగబడడం తథ్యమని అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తోందన్నారు. కొత్త రాజధాని ఏర్పాటు కూడా కలగానే మిగలనుందని, ఇందుకు నిధుల లేమి ప్రధాన కారణమని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడిందని, మూగజీవాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పశుపోషణ శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ నిధులను రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికే ఖర్చు చేయనున్నామని వివరించారు.
మదనపల్లె నీటి సమస్యపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో చర్చించానని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం తన సొంత జిల్లాపై శీతకన్ను వేశారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. జిల్లా కు రూ.100 కోట్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ఎంపీపీలు సుజన, జరీనాహైదర్, సర్పంచ్ శరత్‌రెడ్డి, నేతలు మాధవరెడ్డి, మెట్రో బాబ్‌జాన్, హర్షవర్ధన్‌రెడ్డి, రెడ్డిశేఖర్‌రెడ్డి, తట్టినాగరాజరెడ్డి, నవాజ్, రఫీ పాల్గొన్నారు.