కడప నగరంలోని పలువురు ఫైనాన్షియర్లు, వ్యాపారస్తుల ఇళ్లపై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప నగరంలోని పలువురు ఫైనాన్షియర్లు, వ్యాపారస్తుల ఇళ్లపై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. తిరుపతి నుంచి వచ్చిన అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని నాలుగు చోట్ల దాడులు నిర్వహించారు. చిన్నచౌకు పంచాయతీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్న ఫైనాన్షియర్ మధుసూదన్‌రెడ్డి ఇంటిపై దాడులు చేశారు.
అలాగే ఎర్రముక్కపల్లె పీఎఫ్ క్వార్టర్స్ ఎదురు రోడ్డులో నివసిస్తున్న ఫైనాన్షియర్ శ్రీనివాసులుతో పాటు ఓ వ్యాపారి ఇంటిలో తనిఖీలు చేశారు. భైరవ ట్రాన్స్‌పోర్టు యజమాని మహేంద్రారెడ్డికి సంబంధించిన ఆస్తులపై కూడా దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఎందుకు నిర్వహించింది ఐటీ దాడుల బృందం స్పష్టంగా తెలపడం లేదు. ఉన్నతాధికారులకు నివేదిక తెలియజేస్తామని సమాధానం దాటవేశారు. ఈ దాడుల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం.