- శ్రీకాళహస్తిలోతెలుగుతమ్ముళ్ల అరాచకం
- అధికారులూ చూసి వెళ్లిపోయారు
శ్రీకాళహస్తి: తెలుగు తమ్ముళ్లా ... మజాకానా ... చెరువులో క్లబ్ భవనాలకు దగ్గరుండి అక్రమంగా భూమిపూజ చేయించారు. అభ్యంతరం చెప్పిన రెవెన్యూ అధికారులను సైతం నిలదీసి మరీ ఆ కార్యం పూర్తికానిచ్చారు. మనోళ్లే ఎందుకు అడ్డుకుంటారని నిలదీయగానే అక్కడి నుంచి అధికారులు కూడా పలాయనం చిత్తగించారు. శ్రీకాళహస్తి పట్టణంలో సోమవారం ఈ అరాచకం చోటుచేసుకుంది. ఓ క్లబ్ కమిటీ సభ్యులు పట్టణంలోని అయ్యలనాడు చెరువులో భవనాలు నిర్మించడం కోసం భూమిపూజ చేయడానికి ఉపక్రమించారు.
ఈ సమాచారం తహశీల్దార్ చంద్రమోహన్‌కు అందింది. సిబ్బందిలో వెళ్లి చెరువులో భవనాలు నిర్మించడానికి అనుమతి లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే క్లబ్ సభ్యులు తమకు గతంలో భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించారని తెలిపారు. చెరువుల్లో స్థలాలు కేటాయించరని, ఆధారాలు ఉంటే చూపాలని తహశీల్దార్ ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో చెరువులో భవనాల కోసం భూమిపూజ చేయడానికి వీలులేదని...అడ్డుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే అదే సమయానికి పట్టణానికి చెందిన ముఖ్యమైన టీడీపీ నాయకులు, మునిసిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి అక్కడికి చేరుకున్నారు. మనోళ్లే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు అంటూ తహశీల్దార్‌ను టీడీపీ నాయకులు ప్రశ్నించారు. దీంతో చేష్టలుడిగిన రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్లబ్ సభ్యులు కొందరు టీడీపీ నాయకుల సమక్షంలో ఎంచక్కా యథావిధిగా భూమిపూజ నిర్వహించారు.
మంత్రిది ఓ దారి-ఆయన అనుచరులది మరో దారి....
ఇదేమి విడ్డూరమో ఓ వైపు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెరువుల్లో సెంటు భూమి ఆక్రమించినా రాళ్లతో తరిమికొట్టాలని పదేపదే చెబుతుంటారు. కానీ ఆయన ప్రథమ అనుచరులు దగ్గరుండి చెరువులో భవనాల నిర్మాణం కోసం భూమిపూజ చేయించడం విడ్డూరంగా ఉంది. పేదోడు చెరువులో గుడిసె వేస్తే వెంటనే వాటిని తొలగించడంతో పాటు.... కోర్టు జారీచేసిన ఆదేశాలను చూపే రెవెన్యూ అధికారులు తమ్ముళ్ల చేతిలో మాత్రం కీలుబొమ్మలవుతున్నారు. కళ్లముందే భూమిపూజ నిర్వహిస్తున్నా రెవెన్యూ అధికారులు మాయమైపోవడమే అందుకు నిదర్శనం.
అబ్బే భూమిపూజ జరగలేదు.....
అబ్బే చెరువులో భూమిపూజ జరగలేదు. చెరువులో క్లబ్ సభ్యులు భవనాలు నిర్మించడానికి వారికి అక్కడ సెంటుభూమి కూడా లేదు. మా సిబ్బందితో వెళ్లి అడ్డుకున్నాం.దీంతో వారు వెళ్లిపోయారు.భూమిపూజ చేయలేదు.
-చంద్రమోహన్,తహశీల్దార్.
చెరువులో క్లబ్‌కు భూమిపూజ
Published Tue, May 12 2015 3:02 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement