బొబ్బిలి: రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ పాస్ విధానంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాయింట్ కలెక్టరు బి. రామారావు తెలిపారు.
బొబ్బిలి: రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ పాస్ విధానంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాయింట్ కలెక్టరు బి. రామారావు తెలిపారు. గడచిన నెలలో 80 శాతం వరకూ ఈపాస్ ద్వారా నిత్యావసర సరుకులు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ముందంజ లో ఉన్నామన్నారు. గురువారం బొబ్బిలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈపాస్ విధానం కోసం ఎంపిక చేసిన రేషన్ కార్డుల శాతం మిగతా జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువన్నారు. ఈపోస్ కోసం మొత్తం 456 రేషన్ షాపులను ఎంపిక చేయగా వాటిలో 80 శాతానికి పైగా ఈపోస్ విధానం సక్రమంగా అమలు కావడం వలన ముందు వరుసలో నిలిచామన్నారు.
ఆన్‌లైన్‌లో గత మూడు నెలలుగా జిల్లా ప్రథమంగా నిలిచిందని చెప్పారు. మరో రెండు నెలల్లో జిల్లాలోని 1374 రేషన్ షాపుల్లోనూ ఈ పోస్ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. ఇక నుంచి సిగ్నల్స్ సమస్య లేకుండా డబుల్ సిమ్ యంత్రాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న సదస్సులకు రైతుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. వీటి వల్ల దాదాపు 80 శాతం భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
బుధవారం వరకూ జిల్లావ్యాప్తంగా 7,873 అర్జీలు వచ్చాయని, వీటిపై రెండు నెలల్లో పరిష్కారం చూపిస్తామన్నారు. భూముల వివరాలు కంప్యూటరీకరణ చేసిన దానికి, రికార్డుల్లో ఉన్న దానికి వ్యత్యాసం లేకుండా ఆన్‌లైన్‌లో ఎక్కడ నుంచైనా ఆయా భూముల వివరాలు చూసుకునే విధంగా ఈ పద్ధతిని పెట్టామన్నారు. సమావేశంలో పార్వతీపురం ఆర్డీఓ రోణంకి గోవిందరావు కూడా పాల్గొన్నారు.