రంజాన్ మాసంలో ముస్లింలు నియమనిష్టలతో ఉపవాసం ఉంటారు. సాయంత్రం పండ్లు, అల్పాహారంతో దీక్ష విరమిస్తారు. పగలంతా ఎంతో నిష్టతో ఉపవాసం ఉండడం వల్ల శక్తికోసం రాత్రి గంజి సేవిస్తారు. బలవర్థక ఆహారంగా పేరొందిన గంజి వంటకం ఉపవాసదీక్ష చేస్తున్న వారి శరీరాన్ని చల్లబరుస్తుంది. పేద ముస్లింల పాలిట గంజి సంజీవనిగా పేరు గాంచింది.
మదనపల్లె సిటీః రంజాన్ నెలలోనే తయారుచేసే గంజికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లోని మసీదుల వద్ద గంజి పంపిణీ చేస్తున్నారు. ఇఫ్తార్ సమయంలో పండ్లు, అల్పాహారం లేకపోయినా.. ఒక గిన్నె గంజి అయినా తాగేందుకు ఇష్టపడుతారు. రవ్వ, మసాలా దినుసులతో ప్రత్యేకంగా తయారు చేసే గంజిలో బూందీ కలుపుకుంటే రుచిగా ఉంటుంది. సాయంత్రం అసర్ సమాజ్ అయిన తరువాత మసీదుల వద్ద గంజి పంపిణీ చేస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గంజి కోసం బారులు తీరుతారు. మసీదు పరిధిలోని ముస్లిం జనాభాను బట్టి రోజుకు రూ.5,000 నుంచి 15 వేల వరకు గంజి తయారీ కోసం ఖర్చు చేస్తారు. కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆ రోజుకు గంజి తయారీకి అయ్యే ఖర్చు భరిస్తారు. లేదంటే గంజి తయారీ పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తారు.
గంజి తయారీ ఇలా..
బియ్యపు రవ్వ, అల్లం, యాలాకులు, దాల్చినచెక్క, టమటా, కొత్తిమీర, పుదీనా వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ముందుగా మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, టమటాలను నూనెలో వేయిస్తారు. వంట పాత్రలో నీళ్లు పోసి బాగా మరిగిన నీటిలో బియ్యపు రవ్వను కలుపుతారు. ఇలా గంజిని తయారుచేసి, పూర్తయ్యాక కొద్ది సేపు వంట పాత్రలోకి ఉంచి పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం నుంచి గంజి తయారీని ప్రారంభిస్తే సాయంత్రానికి పూర్తవుతుంది.
30 ఏళ్లుగా గంజి పంపిణీ
మదనపల్లె పట్టణం జామియా మసీదు వద్ద కమిటీ నిర్వాహకులు 30 ఏళ్లుగా రంజాన్ మాసంలో ఉపవాసదీక్షపరులకు ఉచితంగా గంజి పంపిణీ చేస్తున్నారు. సాయంత్రం కాగానే మసీదు వద్ద ఘుమఘుమలతో సిద్ధమవుతుంది. దీని తయారీకి ప్రత్యేకంగా వంట వారిని ఏర్పాటుచేశారు. దాతల సహకారంతో ప్రతిరోజూ దాదాపు 10 వేల మందికిపైగా గంజి అందజేస్తున్నారు. ఉపవాసదీక్షపరుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన గంజిని కుల, మతాలకు అతీతంగా ఇష్టపడతారు.