సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలతో ఇక కోతలు ఉండవని భావించిన ప్రజలకు, రైతాంగానికి ట్రాన్‌సకో నిర్ణయం ఆశనిపాతంలా మారింది. శనివారం నుంచి పల్లెల్లో పగటి పూట సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు శుక్రవారం ట్రాన్‌సకో అధికారులు ప్రకటించారు. దీంతో ఖరీఫ్ సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతన్న ట్రాన్స్‌కో నిర్ణయంతో ఆందోళనకు గురవు తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత జిల్లాలో మంచి వర్షాలు కురిసాయి. ఖరీఫ్ సీజన్‌పై రైతులు భారీగా ఆశలు పెంచుకున్నారు. ఈసారీ వరి పంట విస్తీర్ణం సాధారణ స్థాయికన్నా పెరిగింది. బోర్లు, బావులు నిండుగా వున్నాయి. ముందు ముందు ఆశించిన వర్షాలు కురువకున్నా బోర్ల ద్వారా పంటలకు సాగు నీరు అందించాలని భావిస్తున్నారు.
కాగా గ్రామీణ ప్రాంతాల్లో కొంతకాలం నుంచి సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా 24 గంటల పాటు ఉండడంతో రైతులు విశ్వాసంగా ఉన్నారు. అయితే తాజాగా పట్టణాలు, మండల కేంద్రాలు మినహా శనివారం నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే సింగిల్ ఫేజ్ కరెంట్‌ను సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలోని పల్లెసీమల్లో పగటి పూట విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. పల్లెల్లోని సామాన్య జీవనానికి ఈ 12 గంటల సింగిల్ ఫేజ్ విద్యుత్ కోత తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. అదేవిధంగా పంటలకు సైతం ఆశించిన నీటిని సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని రైతాంగం ఆందోళన చెందుతున్నారు.
సహకరించక తప్పదు.. మెరుగైతే పెంచుతాం
విద్యుత్ డిమాండ్ పెరగడంతో సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాను పల్లె ప్రాంతాలకు పగటి వేళ నిలిపివేయాల్సి వస్తోంది. ప్రజలు సహకరించాలి. విద్యుత్ సరఫరా పెరిగినా, డిమాండ్ కొంచం తగ్గినా సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాను తప్పక మెరుగుపరుస్తాం.
- రాములు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి
నేటి నుంచి పల్లెల్లో పగటివేళ విద్యుత్ సరఫరా బంద్
Published Sat, Aug 24 2013 1:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement