ఆగని ‘ఎర్ర’ స్మగ్లింగ్ | Incessant 'red' Smuggling | Sakshi
Sakshi News home page

ఆగని ‘ఎర్ర’ స్మగ్లింగ్

Published Sun, May 18 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

ఆగని ‘ఎర్ర’ స్మగ్లింగ్

ఆగని ‘ఎర్ర’ స్మగ్లింగ్

  •      మొన్న అంబులెన్స్‌ల్లో.. నిన్న వాటర్ ట్యాంకర్లలో తరలింపు
  •      టాస్క్‌ఫోర్స్ దాడులతో బయటపడిన వైనం
  •      కీలక స్మగ్లర్లు కర్ణాటక కటికనహళ్లిలో
  •      గతవారం 300 మంది తమిళ కూలీల అరెస్టు
  •  సాక్షి, చిత్తూరు: కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్నా జిల్లాలో ఎర్రచందనం నరికేందుకు వస్తున్న కూలీల సంఖ్య తగ్గడం లేదు. ఎర్రచందనం రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఏడాదిగా సాయుధ పోలీసులతో దాడులు నిర్వహిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. స్మగ్లర్లు రోజుకొక కొత్త మార్గాన్ని అన్వేషిస్తూ శేషాచలం కొండల నుంచి ఎర్రచందనం తరలించేస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో ఆ విధుల్లో ఉన్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారం రోజుల నుంచి కర్ణాటక, తమిళనాడు మార్గాలపై నిఘా పెట్టారు.

    కేవీబీ పురం, శ్రీకాళహస్తి రూరల్ పనబాకం, ఏర్పేడు సమీపంలోని పంగూరు, రేణిగుంట మండలం మామండూరు అటవీ సమీపప్రాంతాల్లో దాదాపు 300 మంది తమిళ కూలీలను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల నేండ్రగుంట సమీపంలో కర్ణాటక బస్సు నిండా వస్తున్న తమిళ కూలీ లను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపిం చారు. వారం రోజుల్లోనే రూ.3 కోట్లకు పైగా విలువ చేసే ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.

    తాజాగా శనివారం రాత్రి చంద్రగిరి-పనబాకం మార్గంలో వాటర్‌ట్యాంకర్ లోపల ఎర్రచందనం దుంగలను తరలిస్తూ ఒక డ్రైవర్, ఈ వాహనం వెనుక కారులో వస్తున్న స్మగ్లర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు సూత్రధారుల కోసం నిందితులను టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
     
    స్మగ్లింగ్‌కు కొత్తకొత్త మార్గాలు

    పోలీసుల, అటవీ శాఖ అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ సాగించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. గతంలో ఒకేసారి రెండు నుంచి మూడు అంబులెన్స్ వాహనాల్లో ఎర్రచందనం తరలించేందుకు సిద్ధం చేస్తుండగా అటవీ, పోలీసు అధికారులు సీజ్ చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని స్మగ్లర్లు ఇప్పుడు వాటర్ ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. దొంగిలించిన వాహనాలనే ఇలా ఎర్రచందనం రవాణాకు ఉపయోగిస్తున్నారు.

    ఎర్రచందనం కూలీలను నేరుగా తమిళనాడు నుంచి చిత్తూరు మీదుగా రానివ్వకుండా బెంగళూరుకు పిలిపించుకుని అక్కడి నుంచి యాత్రికుల ముసుగులో కర్ణాటక ఆర్‌టీసీ బస్సుల్లో తిరుపతి పరిసరాలకు పంపేందుకు కొత్త వ్యూహం అనుసరిస్తున్నారు. ఇది బెడిసికొట్టి నేండ్రగుంట వద్ద అటవీ శాఖ అధికారులకు దొరికారు.
     
    ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డా కటికనహళ్లి

    కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రూరల్‌లోని కటికనహల్లి గ్రామాన్ని ఎర్రచందనం స్మగ్లర్ల అడ్డాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వాటర్ ట్యాంకర్‌లో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడిన కీలక స్మగ్లరు ద్వారా ఈ విషయా న్ని రాబట్టారు. ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరినట్లు పోలీసులు గుర్తించారు.

    ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ చీఫ్‌గా ఉన్న ఉదయకుమార్ ఇదివరకే ఈ కోణంలో దర్యాప్తునకు పోలీసులను రంగంలోకి దింపారు. దుబాయ్ కేంద్రంగా ఎర్రచందనం రవాణా లింకులు ఉన్నాయని గ్రహించారు. శేషాచలం కొండల నుంచి తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను బెంగళూరు సమీప గ్రామంలోని పొలాల్లో నిల్వ ఉంచి అక్కడి నుంచి చెన్నై, మంగళూరు పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారుల వద్ద వివరాలు ఉన్నాయి. వీరికి సహకరిస్తున్న ముగ్గురు నలుగురు స్థానిక స్మగ్లర్లను కూడా ఇటీవల తలకోన బీట్‌లోని పల్లెల సమీపంలో అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement