సత్తుపల్లి, న్యూస్‌లైన్: సింగరేణి భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికిగాను ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సత్తుపల్లిలో సింగరేణి భూనిర్వాసితుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. నూతన భూసేకరణ చట్టం అమలులోకి వచ్చేదాకా ఆగకుండా, పాత చట్టం ప్రకారంగానే భూమిని సేకరించిన జిల్లా అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉంటే అధికారులు అత్యుత్సాహం చూపేవారు కాదని అన్నారు. రైతులపక్షాన ఉద్యమించేందుకు ఎంత దూరమైనా వెళ్తామన్నారు. రైతు బిడ్డగా.. కష్టాల్లో ఉన్న సాటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సత్తుపల్లిలోని సింగరేణి భూనిర్వాసితుల సమస్యలను వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో చర్చించి, నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేలా ఒత్తిడి తెస్తామన్నారు. అందరితో చర్చించి ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
వైఎస్‌ఆర్ ఉంటే ఈ గతి పట్టేది కాదు...
‘సారూ.. వైఎస్.రాజశేఖర రెడ్డి బతికుంటే మాకు ఈ గతి పట్టేది కాదు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు’ అంటూ, కొమ్మేపల్లి గ్రామానికి చెందిన భూనిర్వాసితులైన ముస్లిం, దళిత మహిళలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద విలపించారు. సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా తమ భూములను లాక్కుంటే ఎలా బతకాలనిఆవేదనగా ప్రశ్నించారు. దీనికి పొంగులేటి స్పందిస్తూ... ‘మీకు వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుంది. న్యాయం జరిగేంత వరకు నేను చూసుకుంటా. మీరు (దళిత, ముస్లిం, గిరిజనులు) కోర్టుకు వెళ్లేందుకు ఎంత ఖర్చయినా భరిస్తా. ఎటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించేందుకైనా సిద్ధంగా ఉన్నాం’ అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కీసర వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్-మండల కన్వీనర్లు కోటగిరి మురళీకృష్ణారావు, పాలకుర్తి యాకోబు, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, నాయకులు మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మందపాటి ప్రభాకర్‌రెడ్డి, మలిరెడ్డి మురళీరెడ్డి, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, దేశిరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎస్‌కె.మౌలాన, నారాయణవరపు శ్రీనివాస్, అరిగే సత్యనారాయణ చారి, ఎండి.బాబా, నూర్‌పాషా సంఘం మండల అధ్యక్షుడు ఎస్‌కె.మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి భూనిర్వాసితుల సమస్యలపై ఆమరణ దీక్ష చేస్తా
Published Fri, Jan 3 2014 3:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement