
ఇండియన్ వుమెన్ రియల్లీ గ్రేట్!
జర్మనీ దేశానికి చెందిన యువతులు స్థానికంగా గ్రామీణ మహిళలు వరినాట్లు వేస్తున్న విధానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
నర్సీపట్నం(విశాఖపట్నం): జర్మనీ దేశానికి చెందిన యువతులు స్థానికంగా గ్రామీణ మహిళలు వరినాట్లు వేస్తున్న విధానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాకవరపాలెం మండలం ఇమ్మాన్యుయేల్ సంస్థ వ్యవస్థాపకుడు జీవన్‌రాయ్ ఆధ్వర్యంలో జర్మన్ దేశస్తులు సోమవారం తాండవ రిజ ర్వాయరును చూడటానికి వచ్చారు. తాండవ అందా లను తిలకించి వస్తుండగా మార్గమధ్యంలో పంట పొలాల్లో మహిళలు వేస్తు న్న వరి నాట్ల చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. మహిళలు నీటితో దిగి వంగి వంగి ఏం చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలో ప్రజలు తినే వరి ధాన్యం పండించడానికి ఈ విధంగా చేయాలని చెప్పడంతో వారు.. ఆసక్తిగా నాట్లు వేస్తున్న మహిళా కూలీల వద్దకు వెళ్లారు.
కాసేపు వారు వేస్తున్న వరినాట్లను పరీశీలించారు. తర్వాత వారు కూడా కూలీలతో కలిసి కొంతసేపు వరినాట్లు వేశారు. కొద్దిసేపటికే వారు ఆయాసపడి.. నీటిలో గంటల తరబడి శారీరకంగా ఎంతో శ్రమపడుతూ మహిళలు నాట్లు వేయడం చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. నాట్లు వేస్తున్న మహిళా కూలీలను అభినందిస్తూ.. ‘వావ్.. ఇట్స్ డిఫికల్ట్ వర్క్.. నీడ్ మోర్ పేషెన్సీ.. ఇండియన్ వుమన్ ఆర్ వెరీ గుడ్.. అండ్ వెరీ గ్రేట్’ అంటూ కితాబిచ్చారు. కూలీలకు జర్మనీ యువతులకు మధ్య సంభాషణను జీవన్‌రాయ్ అనువాదం చేశారు. వారివెంట నాతవరం మండలానికి చెందిన చర్చి పాస్టర్ జకర్యా ఉన్నారు.